ఆఫీసుకి ఇలా వెళ్తే... ఆయుష్షు పెరుగుతుంది!

ఇరవై ఏళ్ల క్రితం, రోడ్డు మీద ఎక్కడ చూసినా సైకిళ్లే కనిపించేవి. గ్లోబలైజేషన్‌ పుణ్యమా అని ఇప్పుడు రోడ్లన్నీ మోటర్‌ సైకిళ్లతో నిండిపోయాయి. ఒళ్లు అలవకుండా ఉండేందుకో, ప్రతిష్ట కోసమో... ఇప్పుడు జనాలంతా బైక్‌ల మీదే కనిపిస్తున్నారు. కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. బైక్‌లని కాస్త పక్కన పెట్టి సైకలెక్కితే ఆయుష్షు పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఓ సర్వేని చూపిస్తున్నారు.


బ్రిటన్‌లోని దాదాపు 22 ప్రాంతాలలో ఈ సర్వేను నిర్వహించారు. 2,50,00 మంది ఉద్యోగుల మీద ఓ ఐదేళ్ల పాటు నిర్వహించిన ఈ సర్వేలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ రెండులక్షలా యాభైవేలమందిలో ఐదేళ్లకాలం ముగిసేసరికి 2,430 మంది చనిపోయారు. 3,748 మందికి కేన్సర్‌ సోకింది. 1,110 మంది గుండెజబ్బుల బారిన పడ్డారు. అయితే ఈ గణాంకాలకీ వారిలో సైకిల్ తొక్కడానికీ మధ్య సంబంధం ఉండటమే ఆశ్చర్యం కలిగించే అంశం.


వాహనాల మీద ఆఫీసుకి వెళ్లేవారితో పోలిస్తే, సైకిల్‌ తొక్కేవారిలో కేన్సర్‌ సంభవించే అవకాశం 45 శాతం తక్కువని తేలింది. వీరిలో గుండెజబ్బు సోకే ప్రమాదం కూడా 46 శాతం తక్కువగా నమోదైంది. ఏతావాతా.... సైకిల్‌ మీద ప్రయాణం చేసేవారు, ఇతరులతో పోలిస్తే అర్థంతరంగా చనిపోయే ప్రమాదం దాదాపు 40 శాతం తక్కువని వెల్లడైంది.


సైకిల్ మీద ఆఫీసుకి వెళ్లేవారు, సగటున వారానికి 30 మైళ్ల వరకూ ప్రయాణం చేస్తున్నట్లు తేలింది. ఇదేమీ మామూలు వ్యాయామం కాదు కదా! క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తే ఎంత లాభమో, రోజూ సైకిల్‌ తొక్కడం వల్ల అంతే లాభమని చెబుతున్నారు. ఒక్కసారి కనుక ఈ అలవాటు మన జీవితంలో భాగమైతే, అదిక పెద్ద కష్టంగా తోచదని భరోసా ఇస్తున్నారు. అంతేకాదు! ఊబకాయం, పొగత్రాగడం, ఆహారనియమాలు పాటించపోవడం వంటి సందర్భాలలో కూడా సైకిల్‌ తొక్కడం వల్ల లాభం కనిపించిందట.


ఇంతాచేసి పరిశోధకులు చెబుతున్న విషయం ఏమిటంటే... వీలైనప్పుడల్లా బైక్‌ని పక్కనపెట్టి సైకిల్‌ మీద స్వారీ చేయమనే! దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది, పర్యావరణానికీ మేలు జరుగుతుంది, బస్సుల కోసం నిరీక్షించే సమయమూ మిగులుతుంది. అన్నింటికీ మించి ఆరోగ్యం దక్కుతుంది, ఆయుష్షు పెరుగుతుంది. ఇక నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.


-నిర్జర.