జనసేనలోకి అఖిల ప్రియ..చంద్రబాబుకి కానుక

 

ఏపీలో మంత్రి భూమా అఖిలప్రియ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఆమె గన్‌మెన్లను వెనక్కి పంపడంతో కొత్త చర్చకు తెరతీసినట్లు అయ్యింది. దీంతో అమె తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారని,జనసేనలో చేరుతారని ప్రచారం కూడా జోరందుకుంది. దీనిపై స్పందించిన అఖిలప్రియ ..పార్టీ మారే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. జనసేనలోకి వెళ్లాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నాయని అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే ఆళ్లగడ్డకు నీళ్లు వచ్చాయి...నియోజకవర్గం అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇస్తున్నారు. అలాంటప్పుడు చంద్రబాబుకి ఎందుకు దూరం అవుతానని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, విజయాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తానని అఖిలప్రియ వెల్లడించారు. నా తల్లీతండ్రులు చూపిన బాటలోనే నడుస్తానని తెలిపారు. పోలీసులు తన అనుచరులను వేధిస్తున్నారనే గన్‌మెన్లను దూరంగా పెట్టానని వివరణ ఇచ్చారు. గన్‌మెన్ల వివాదాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని అఖిలప్రియ తెలిపారు. ఎట్టకేలకు పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లని స్పష్టం చేశారు.