బాలీవుడ్ నటి అంజలీ ఆత్మహత్య

కొద్దిరోజుల క్రితం కృతిక చౌదరి అనే మోడల్, నటి తన ఇంట్లోనే దారుణహత్యకు గురైన సంఘటన మరవకముందే మరో వర్థమాన నటి అనుమానాస్పద స్థితిలో మరణించారు. అంజలీ శ్రీవాస్తవ అనే నటి ముంబై అంధేరీలోని జుహూలోని పరిమల్ సోసైటీలో నివాసం ఉంటున్నారు. అయితే కొద్ది రోజులుగా బంధువులు ఫోన్ చేస్తున్నప్పటికీ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో వారు ఇంటి యజమానికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఇంటి యజమాని తన వద్ద ఉన్న డుప్లికేట్ తాళం చెవితో తలుపు తెరచి చూడగా అంజలీ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అంజలీ ఎప్పుడు..? ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే కాని అసలు నిజం వెలుగులోకి వచ్చే అవకాశం లేదని పోలీసులు భావిస్తున్నారు. అంజలీ శ్రీవాస్తవ భోజ్‌పురి చిత్రపరిశ్రమలో మంచి నటిగా ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.