రేగుపళ్లతో ఆరోగ్యం

Publish Date:Jan 11, 2017

ఏ కాలంలో కాసే పండ్లు ఆ కాలంలో తినాలన్నది పెద్దల మాట. అలా చూసుకుంటే చలికాలంలో విస్తృతంగా కాసే పండు రేగు. భోగి పండుగ వస్తోందంటే చాలు, ఇంట్లో పిల్లలకి ఆ రేగితో భోగి పండ్లు పోయకపోతే అదో వెలితిగా తోస్తుంది. పండు అంటేనే పోషకాహారానికీ, ఆరోగ్యానికీ సూచన. ఇక రేగు పండు అంటే మరింత ఆరోగ్యం, మరిన్ని పోషకాలు అంటున్నారు నిపుణులు.

 


- రేగుపండు అనగానే ఠక్కున గుర్తుకువచ్చే అంశం జీర్ణవ్యవస్థ. చలికాలం సహజంగానే మన జీర్ణవ్యవస్థ మందకొడిగా పనిచేస్తుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రేగుపండ్లు ఉపయోగపడతాయి. ఆహారం జీర్ణం కాకపోవడం, ఉబ్బరంగా ఉండటం, గొంతులో మంట వంటి సమస్యలలో రేగు దివ్యంగా పనిచేస్తుంది.


- చలికాలంలో పెద్దలకే జీర్ణశక్తి సరిగా ఉండనప్పుడు ఇక పిల్లల సంగతి చెప్పేదేముంది. ఇప్పుడంటే ప్రోబయాటిక్‌ పొడులూ, డైజెస్టివ్‌ ఎంజైమ్స్‌తో కూడిన టానిక్కులూ చలికాలంలో పిల్లలకి అందిస్తున్నారు. కానీ ఒకప్పుడు చలికాలంలో పిల్లలకి రేగుపండ్లని అందించడం వల్ల సున్నితంగా ఉండే వారి జీర్ణశక్తికి బలం చేకూరేది.

 


- చలికాలంలో మనకి పెద్దగా దాహం వేయదు. దాంతో మంచినీరు తగినంతగా తీసుకోం. దీని వల్ల మన శరీరంలో అనేక సమస్యలు ఏర్పడవచ్చు. డీహైడ్రేషన్‌ దగ్గర్నుంచీ కిడ్నీలో రాళ్ల వరకూ ఏదో ఒక ఉపద్రవం ముంచుకురావచ్చు. రేగుపండ్లలో కావల్సినన్ని పోషకాలతో పాటుగా తగినంత నీరు కూడా ఉంటుంది. ఒక అంచనా ప్రకారం 100 గ్రాముల రేగు పండ్లలో మూడు వంతులకి పైగా నీరే ఉంటుంది.


- దేశీయంగా మనకు లభించే పండ్లలో జామకాయ తర్వాత రేగులోనే ‘సి’ విటమిన్‌ సమృద్ధిగా లభిస్తుందంటారు. అదృష్టవశాత్తు ఈ రెండు పండ్లూ మనకి అందుబాటు ధరల్లోనే దొరుకుతాయి. పుల్లపుల్లగా ఉండే రేగులోని సి విటమిన్ వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి ఇతోధికంగా పెరుగుతుంది. దాంతో చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి వారికి రక్షణ లభించినట్లే!

 


- మధుమేహం ఉన్నవారు చాలారకాల పండ్లను తీసుకోకూడదని చెబుతుంటారు. ఫలానా పండు తినాలని కొందరంటే, కాదు తినకూడదు అని మరికొందరంటారు. రేగు విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఎందుకంటే రేగులో చక్కెర స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. కొవ్వు పదార్థాలూ తక్కువే! ఇక మిగిలిందంతా బి, సి వంటి విటమిన్లు, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్‌ వంటి ఖనిజాలే.


- రేగుపండ్లే కాదు... రేగు చెట్టు బెరడు, ఆకులు, వేర్లతో సహా సంప్రదాయ వైద్యంలో అనేక వ్యాధులకి చికిత్సగా వాడతారు. రేగుపండ్ల గుజ్జుకి పచ్చిమిర్చి, ఉప్పు కలిపి వడియాలుగా చేసుకునే సంప్రదాయం తెలుగునాట ఉంది. ఇక ఉత్తరభారతంలో కొన్ని చోట్ల రేగుపండ్ల పచ్చడిని కూడా చేసుకుంటారు. రేగుపండ్ల గుజ్జుతో వైన్, వెనిగార్లు తయారుచేసుకునే అలవాటు కూడా కొన్ని దేశాలలో కనిపిస్తుంది.

 


ఆరోగ్యపరంగా రేగుకి ఇంత ప్రాధాన్యత ఉండబట్టే దీనిని మన సంప్రదాయాలలో కూడా భాగంగా మలిచారు. వినాయకచవితి రోజున చేసే ఏకవింశతి పత్రపూజలో రేగుపత్రాన్ని కూడా చేర్చారు. లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి! అంటూ ఆ రోజున గణపతిని పూజించుకుంటాము. ఇక భోగిరోజున రేగుపండ్ల వైభవం గురించి చెప్పేదేముంది. భోగిపండ్లుగా పోసాక కిందపడిన రేగుకాయలని తినకూడదన్న నియమం ఉన్నప్పటికీ, ఆ రోజున ఇంట్లో పుష్కలంగా లభించే రేగుపండ్లని చిన్నపిల్లలు పటపటలాడించేస్తారు. ఇక భోగిపండ్ల సంప్రదాయంతో అయినా పిల్లలకి రేగుపండ్లని పరిచయం చేసినట్లవుతుంది.

 

 

- నిర్జర.

By
en-us Health News -