వాళ్ల ఉద్దేశం, సందేశం... అన్నీ దేశమే!

భారత్ లో అమరుల సంస్మరణ దినం జనవరి 30న జరుపుతారు. అధికారికంగా గాంధీజీ చనిపోయిన ఆ రోజు అమరుల త్యాగాలకు గుర్తుగా ఎంచుకున్నా మార్చ్ 23 మాత్రమే అందుకు సరైందని చాలా మంది భావిస్తుంటారు. ఉత్తరాదిలో షహీద్ దివస్ గా మార్చ్ 23ను పేర్కొంటారు. అందుకు కారణం... తల్లి భారతి దాస్య విముక్తి కోసం ముగ్గురు నవ యువకులు ప్రాణాలు త్యాగం చేసిన రోజు... మార్చ్ 23 కావటమే! 86 ఏళ్ల కింద వారి త్యాగంతో పావనమైన భూమి ఇవాళ్ల స్వతంత్ర దేశంగా వర్ధిల్లుతోందంటే అందులో వారు అందించిన ప్రేరణ ఖచ్చితంగా వుందని చెప్పాల్సిందే! ఇంతకీ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ఎవరు? వాళ్లు చేసిన పోరాటం ఏంటి? మీకు తెలుసా... 

 

భగత్ సింగ్ 12ఏళ్ల వయస్సులోనే జలియన్ వాలా బాగ్ మారణకాండని చూసి చలించిపోయాడు. 1919వ సంవత్సరంలో వందలాది మందిని డయ్యర్ కాల్పులు జరిపించి పొట్టనబెట్టుకున్నాడు. అది చూసి కదిలిపోయిన భగత్ జలియన్ వాలా బాగ్ లోని రక్తంతో తడిసిన మట్టిని సీసాలో దాచుకుని దేశం కోసం తపించి పోయేవాడు!భగత్ సింగ్ చిన్నప్పట్నుంచే సాయుధ పోరాటం గురించి మాట్లాడేవాడు. ఇంకా లోక జ్ఞానం లేని సమయంలోనే పొలాల్లో గన్నులు పెంచి బ్రిటీష్ వాళ్లని ఎదుర్కోవాలని అనేవాడట! ఆ విప్లవ ఆలోచనలు తరువాతి కాలంలో సోషలిజమ్, సోషలిస్టు విప్లవం గురించిన సాహిత్యం చదివాక మరింత పదునెక్కాయి! క్రమక్రమంగా కమ్యూనిజం వైపు ఆకర్షితుడైన భగత్ సింగ్ అంతిమంగా నాస్తికుడు, హేతువాది అయ్యాడు. అయితే, తన ఏకైక దైవం దేశమే అనుకున్న ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఇన్ క్విలాబ్ జిందాబాద్ నినాదం అందించాడు. ఇన్ క్విలాబ్ జిందాబాద్ అంటే ... విప్లవం వర్ధిల్లాలి అని అర్థం!

 

1929లో భగత్ సింగ్ తన తోటి యోధులతో కలిసి ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు పేల్చాడు. అది ఎవ్వర్నీ చంపటానికి ఉద్దేశించిన ప్రయత్నం కాదు. కేవలం తమ పోరాటం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించటం కోసం మాత్రమే! తరువాత భగత్ సింగ్ జైల్లో చారిత్రక ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఖైదీలకు, స్వాతంత్ర్య సమర యోధులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసి ...సాధించాడు!

 

మార్చ్ 23న ఒకే రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లలో రాజ్ గురుయే చిన్నవాడు. ఆయన వయస్సు కేవలం 22 మాత్రమే. భగత్ 23ఏళ్ల వాడు కాగా సుఖ్ దేవ్ 24ఏళ్ల వయస్సు వాడు. ఈ ముగ్గురిలో రాజ్ గురు మహారాష్ట్రా వాసి. పుట్టుకతో బ్రాహ్మణుడైనా సాయుధ పోరాటమే జాతి విముక్తికి పరిష్కారమని నమ్మాడు. గాంధీ అహింసా మార్గం, సహాయ నిరాకరణ విశ్వసించే వాడు కాదు. ఇవాళ్ల రాజ్ గురు జన్మస్థానమైన పూణే దగ్గర్లోని ఖేద్ ను రాజ్ గురు నగర్ గా పిలుస్తున్నారు! ముగ్గురిలో మూడోవాడైన సుఖ్ దేవ్ పంజాబ్ లోని లుధియానాకు చెందినవాడు. ఆయన కూడా సాయుధ పోరాటమే బ్రిటీష్ వారికి బుద్ది చెబుతుంది నమ్మేవాడు. అంతే కాదు, సుఖ్ దేవ్ మహాత్మ గాంధీకి ఆయన చేపట్టిన అహింసాయుత ఉద్యమాన్ని తిరస్కరిస్తూ లేఖ కూడా రాశాడు. తాము చేస్తున్న హింసాత్మక పోరాటాన్ని గాంధీజీ గుర్తించకపోవటాన్ని సుఖ్ దేవ్ తప్పుబట్టాడు.

 


భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ఉరి శిక్ష పడటానికి కారణమైన హత్య జాన్ సాండర్స్ అనే బ్రిటీష్ పోలీస్ అధికారిది. నిజానికి వాళ్లు ముగ్గురూ ఆయన్ని చంపుదామని అనుకోలేదు. జేమ్స్ స్కాట్ అనే బ్రిటీష్ అధికారిని మట్టుబెడదామని భావించారు. కాని, పొరపాటున సాండర్స్ చనిపోయాడు. లాహార్లో భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు సాండర్స్ ను చంపిన కేసులోనే వారికి ఉరిశిక్ష పడింది. 

 

ఉరిశిక్ష అమలు చేస్తే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావచ్చనే ఉద్దేశంతో ముగ్గురు వీరుల్ని బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించిన సమయాని కంటే 11గంటల ముందే మృత్యు దేవతకు అర్పించింది. అలా మార్చ్ 23, 1931న రాత్రి 7.30కి భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు వీర స్వర్గం పొందారు. వారి పార్థివ దేహాల్ని రహస్యంగా జైలు గోడలకున్న కన్నాల్లోంచి బయటకు తరలించిన బ్రిటీష్ వారు అక్కడే దహనం చేసి... భస్మాన్ని సట్లెజ్ నదిలో కలిపేశారు! అలా వారి త్యాగం సింధూ నదికి ఉపనది అయిన సట్లెజ్ వున్నంత కాలం... భారతీయులు ఆ నది నీళ్లు తాగుతున్నంత కాలం చిరస్థాయిగా వుండిపోయింది!