పరుగు పెడితే మోకాలి నొప్పులు రావు


పరుగుతీయడం వల్ల మోకాళ్లు త్వరగా అరిగిపోతాయని ఓ ప్రగాఢమైన నమ్మకం. అందుకే మోకాళ్లకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు అసలు పరుగు జోలికే పోరు. కానీ పరుగులెత్తితే మోకాళ్లకి కొత్త బలం వస్తుందని ఓ కొత్త పరిశోధన నిరూపిస్తోంది.

 

పరుగులెత్తించారు

అమెరికాలోని ‘బ్రిగాం యంగ్‌ యూనివర్సిటీ’కి చెందిన కొందరు పరిశోధకులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఇందుకోసం వాళ్లు 15 మంది ఆరోగ్యవంతమైన యువకులను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 18 నుంచి 35 ఏళ్ల వయసు లోపువారే! ఈ 15 మందిలో 11 మంది మగవారు కాగా 4 ఆడవారు. ఈ 15 మంది చేతా ఒక అరగంట పాటు పరుగులెత్తించారు పరిశోధకులు. ఆ పరుగుకి ముందూ, తరువాతా వారి రక్తాన్ని పరీక్షించారు. దాంతో పాటుగా మోకాళ్ల దగ్గర ఉంటే Synovial fluid (SF) అనే జిగురుని కూడా పరీక్షించారు.

 

వాపు లేదు

ఆశ్చర్యకరంగా మోకాళ్ల వాపు సమయంలో కనిపించే ‘సైటోకైన్స్‌’ (Cytokines) అనే తరహా రసాయనాలు... పరుగు తరువాత తగ్గిపోవడాన్ని గమనించారు. ఈ సైటోకైన్స్‌ మనలోని రోగనిరోధకశక్తిలో ఓ ముఖ్యభాగం. శరీరంలో ఎక్కడన్నా వాపు కానీ ఇన్ఫెక్షన్‌ కానీ కనిపించినప్పుడు, శరీరంలోని రక్షణవ్యవస్థను ఇవి అప్రమత్తం చేస్తాయి. పరుగు తరువాత వీటి ఉనికి తక్కువగా కనిపించింది అంటే వాపు కలిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అర్థం.

 

పరుగు ఓ మందు

భవిష్యత్తులో ఆర్థ్రైటిస్ వంటి రోగాల బారిన పడి మోకాలినొప్పులు రాకుండా ఉండాలంటే, పరుగుని కూడా ఓ మందులా భావించమంటున్నారు పరిశోధకులు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఇప్పటికే మోకాలిసమస్యలతో బాధపడుతున్నవారి సంగతి ఏమిటి? అన్న ఆలోచన కూడా వచ్చింది పరిశోధకులకి. అందుకనే ఇప్పుడు ఆ దిశగా మరిన్ని పరిశోధనలు మొదలుపెట్టారు.

 

మోకాలినొప్పులు – నడక

మోకాలినొప్పులతో పరుగు తీయడం ఎంతవరకు శ్రేయస్కరం అన్నదాని మీద రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అవి ఓ కొలిక్కి వచ్చేవరకు మోకాలి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా పరుగులు తీస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే మోకాలి సమస్యలు ఉన్నప్పుడు నడక మాత్రం చాలా మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదంటున్నారు. దానికి ఈ కారణాలను విస్పష్టంగా చెబుతున్నారు...

 

- నడక వల్ల శరీర బరువు తగ్గుతుంది. ఒంటి బరువు తగ్గితే మోకాళ్ల మీద కూడా బరువు తగ్గినట్లే కదా!

 

- నడుస్తూ ఉండటం వల్ల కాళ్లు బలపడతాయి. ఒంటి బరువంతా కేవలం మోకాళ్ల మీదే పడకుండా కాలిలోని మిగతా ఎముకలు, కండరాలు కూడా తోడ్పడతాయి.

 

- మోకాళ్ల మధ్య ఉండే కార్టిలేజ్ అనే జిగురుపదార్థం నడక వల్ల బలాన్ని పుంజుకుంటుంది. దీని వలన మోకాళ్లలలోని ఒరిపిడి తగ్గుతుంది.

 

అదీ విషయం! దీంతో మోకాలి సమస్యలు రాకుండా ఉండాలంటే పరుగులు పెట్టాలనీ, ఇప్పటికే ఆ సమస్య ఉన్నవారు నడకని మానుకోకూడదనీ చెప్పుకోవచ్చన్న మాట!

 

- నిర్జర.