ఇంట్లో తింటేనే ఆరోగ్యం, పొదుపు

 


ఇప్పుడు జీవితమంతా పరుగులమయం. ఈ పరుగుల మధ్య కావల్సినంత డబ్బయితే సమకూరుతోంది కానీ ఇంటిపని చేసుకునేంత తీరిక కానీ ఓపిక కానీ మిగలడం లేదు. దాంతో ఆ డబ్బుతోనే కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నాం. రోజంతా ఎలాగూ కష్టపడ్డాం కదా అని బయటే తినేస్తున్నాం. దీని వల్ల డబ్బుకి డబ్బు, ఆరోగ్యానికి ఆరోగ్యం వృధా అయిపోతున్నాయని నిపుణులు నొచ్చుకొంటున్నారు.

 

దాదాపు మూడేళ్ల క్రితమే ఇంటి వంట గురించి ఓ పరిశోధన జరిగింది. ఓ తొమ్మిదివేల మంది మీద జరిగిన ఈ పరిశోధనలో ఇంట్లో వండుకునే వంటలో చక్కెర, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయని తేలింది. అంటే ఇంటి వంట ఎక్కువ పోషకాలను అందిస్తూ, తక్కువ కెలోరీలని ఇస్తుందన్నమాట. దీని వల్ల ఆరోగ్యం భేషుగ్గా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు కదా! ఇంటి వంట అనగానే కాస్త పరిశుభ్రమైన రీతిలో వండుకుంటాం. అందులో ఎంత ఉప్పు పడుతోంది, ఎంత నూనె వేస్తున్నాం, మసాలా వేయాలా వద్దా... లాంటి విషయాలన్నీ మన విచక్షణకు అనుగుణంగానే ఉంటాయి. బయట వండేవారు కేవలం రుచిని, లాభాన్నీ మాత్రమే పట్టించుకుంటారు కదా!

 

ఇంటి వంట భేషైనది అని చెప్పేందుకు తాజాగా మరో పరిశోధన కూడా జరిగింది. University of Washington Health Sciences చేసిన ఈ పరిశోధన కోసం 437 మందిని ఎన్నుకొన్నారు. వీరు ఒక వారంలో ఇంటి వంట ఎన్నిసార్లు తిన్నారో, అందులో ఎలాంటి ఆహారం ఉంది అని వాకబు చేశారు. ఈ ఆహారాన్ని healthy eating index అనే ఓ జాబితాతో పోల్చి చూశారు.

 

మన ఆహారంలో పళ్లు, కూరగాయలు, పాలపదార్థాలు, తృణ ధాన్యాలు, ఉప్పు, పప్పులు... ఇలా ఏ పదార్థం ఏ మోతాదులో ఉంటే బాగుంటుందో సూచించే జాబితానే ఈ healthy eating index. దీని ద్వారానే అమెరికా ప్రభుత్వం తమ పౌరుల ఆరోగ్యానికీ- ఆహారానికీ మధ్య సంబంధాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది. వారానికి మూడు రోజులే ఇంట్లో వండుకునేవారితో పోలిస్తే, వారంలో ఆరు రోజులపాటు ఇంటి వంటను తినేవారు healthy eating indexలో ఎక్కువ మార్కులను సాధించినట్లు తేలింది. పోషకాల తక్కువైతే మాత్రమేం! బయట తినడం వల్ల ఖర్చు మాత్రం విపరీతంగా అవుతోందని పరిశోధకులు గ్రహించారు.

 

బయట తిండికి సంబంధించి పరిశోధకులు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తేల్చారు.

- చవకబారు ఫాస్ట్‌ఫుడ్స్ తినడంలో పేదవారే ముందుంటారని అందరూ అనుకుంటారు. నిజానికి పేదాగొప్పా అన్న తారతమ్యం లేకుండా అంతా ఒకేలా ఈ చిరుతిళ్లని తింటున్నారని బయటపడింది.

- 1970లతో పోలిస్తే బయట ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు చేరుతున్నాయని గమనించారు.

- ఎక్కువమంది పిల్లలు ఉన్న ఇళ్లలో.... ఇంటి వంటకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలింది.

 

- నిర్జర.