శిరీష సూసైడ్‌కి... ఎస్సై ఆత్మహత్యకి నిజంగానే లింకుందా? లేక లింక్‌ చేశారా?

 

బ్యూటీషియన్‌ శిరీష... ఎస్సై ప్రభాకర్ రెడ్డి మరణాలు ఆత్మహత్యలేనని పోలీసులు తేల్చేస్తున్నా... ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు వెంటాడుతున్నాయి... ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నా... ఈ ఇద్దరూ ధైర్యవంతులేనని ...అసలు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమేలేదంటున్నాయి బాధిత కుటుంబాలు. ముఖ్యంగా పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వ్యక్తుల వ్యక్తిత్వంపై బురద జల్లుతున్నారని మండిపడుతున్నారు. శిరీష బ్యూటీషియన్ గా ఉద్యోగం చేస్తుంటే... ఆమె వ్యక్తిత్వానికి మచ్చతెచ్చే విధంగా అభ్యంతరకర ఆరోపణలు చేయడం దారుణమంటున్నారు. అసలు గొడవకు కారణమైన తేజస్విని ఎక్కడుందో చెప్పాలంటున్నారు శిరీష తండ్రి రవీంద్ర, అక్క భార్గవి. ఆమె ఫొటో కూడా బయటకు లీక్ చేయని అధికారులు తమ కూతురిపై మాత్రం అడ్డమైన ఆరోపణలూ చేస్తున్నారని, కేసును తాము అనుకున్న కోణంలో తిప్పుకున్నారనీ శిరీష తండ్రి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఈ కేసును వదిలేది లేదని, తమకు న్యాయం జరిగే వరకూ పోరాడతామంటున్నారు.

 

కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై అనేక అనుమానాలు రేగుతున్నాయి. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు కూడా దర్యాప్తు తీరును తప్పుబడుతున్నారు. తన బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదనీ, అతడికి సమస్యలు కూడా లేవని ప్రభాకర్ తల్లి అంటున్నారు. సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ పై లైంగిక ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఎస్సై ప్రభాకర్ ముమ్మాటికీ ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, మామూళ్ల కోసం జరిగిన వేధింపుల కారణంగానే చనిపోయాడని అంటున్నారు. ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు శిరీష ఎపిసోడ్ కి అసలు లింకే లేదంటున్నారు ఆయన బంధువులు. ఉన్నతాధికారుల వేధింపులకే ప్రభాకర్ సూసైడ్ చేసుకున్నాడని, ఆ విషయం బయటకు రాకుండా... శిరీష ఎపిసోడ్ ను తెరపైకి తెచ్చి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

 

మరి నిజంగానే ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మరణం వెనుక ఉన్నతాధికారుల ఒత్తిళ్లున్నాయా? దృష్టి మళ్లించడానికే శిరీష ఎపిసోడ్ ను లింక్ చేశారా? అసలు ప్రభాకర్ ది సూసైడా? లేక పోలీసులు అల్లుతున్న కట్టుకథా?. ఈ కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చేవరకూ పోరాడతామని రెండు కుటుంబాలు ప్రకటించడంతో... కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందా?