ఒక వివాహేతర సంబంధం… రెండు విషాదంతాలు!

 

ఒక వివాహేతర సంబంధం… రెండు ఆత్మహత్యలు… రెండు రాష్ట్రాల్ని సంచలనంలో ముంచేశాయి! బ్యూటీషన్ శిరీష ఆత్మహత్య రెగ్యులర్ గా టీవీల్లో వచ్చే క్రైం న్యూస్ బ్రేకింగ్ లా మొదలై గంటకు గంటకు మలుపులు తిరిగి పెద్ద దుమారంగా మారింది! చివరకు, పోలీసులు తాము మిస్టరీ ఛేదించామని చెప్పటంతో ప్రస్తుతానికైతే జైలు గొడల మధ్యకి వెళ్లి ఆగింది. శ్రవణ్, రాజీవ్ లు దోషులని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఇటు శిరీష ఫ్యామిలీ కాని, అటు ఎస్సై ప్రభాకర్ రెడ్డి కుటుంబం కాని పోలీసుల వర్షన్ ని నమ్మటం లేదు. వాళ్లకే కాదు నిజానికి చాలా మందికి చాలా చాలా అనుమానాలు వున్నాయి…

 

ఫోటోగ్రాఫర్ అయిన రాజీవ్ , బ్యూటీషన్ శిరీష మధ్య ఎక్స్ ట్రా మ్యారిటల్ ఎఫైర్ వుందనేది పెద్దగా సందేహించాల్సిన అవసరం లేని విషయం. అసలు మొత్తం విషాదానికి వాళ్ల ఆ తొందరపాటే కారణం. భర్త, ఒక కూతురు కూడా వున్న శిరీష … రాజీవ్ ఆకర్షణకు లొంగటంతోనే పద్మవ్యూహంలో చిక్కుకుంది. ఇక అందులోంచి బయటకు రాలేకపోయిన ఆమె రాజీవ్ ప్రియురాలు తేజస్విని ఎంట్రీతో మరింత రొంపిలోకి దిగబడింది. పోలీస్ స్టేషన్ ల దాకా గొడవ వెళ్లినప్పటికీ ఆమె రాజీవ్ తో ఎఫైర్ తెంచుకోలేదు. కానీ, శిరీషతో సంబంధం పెట్టుకున్న రాజీవ్ పెళ్లి మాత్రం తేజిస్వినీని చేసుకోవాలనుకున్నాడు. ఇదే సంక్షోభానికి దారి తీసింది. శిరీష తన భర్తని, రాజీవ్ తన ప్రియురాల్ని మోసం చేస్తూ వచ్చారనే భావించాలి. అదే క్రమంగా సుడిగుండంలా మారుతూ వచ్చింది!

 

శిరీష, రాజీవ్, తేజస్వినీల ముక్కోణ కథలోకి శ్రవణ్ ప్రవేశించటం మరింత దారుణంగా మార్చింది పరిస్థితిని. పోలీసుల కథనం ప్రకారమైతే అతనే ఎస్సై ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దింపి మొత్తమంతా విషమంగా మార్చేశాడు! ఉద్దేశ్యపూర్వకంగా శిరీషని ట్రాప్ చేశాడని పోలీసులు అంటున్నారు. ఆమెని ఎస్సై వద్దకి దురుద్దేశంతోనే తీసుకెళ్లాడనీ తమ దర్యాప్తులో తేలిందంటున్నారు. అసలు శ్రవణ్ ట్రాక్ రికార్డే బాగాలేదని గట్టిగా చెబుతున్నారు పోలీసులు!

 

పోలీసుల వర్షన్ కరెక్టా కాదా అనే చర్చలోకి వెళితే చాలా అనుమానాలే వస్తాయి. ప్రధానంగా కుక్కునూరు పల్లె జనం తమ ఎస్సై కోసం రోడ్డు పైకి వచ్చారంటే… ఆయన ఎంతో మంచి పేరే కలిగి వుండాలి. అదీ కాక ఒకవేళ ఆయన శిరీషపై అఘాయిత్యానికి పాల్పడ్డా కూడా… పోలీసు శాఖలో వున్న ఆయన భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవటం కాస్త నమ్మదగ్గ విషయంగా లేదు. కేవలం పరువు పోతుందనో, సస్పెండ్ అవుతాననో ఒక పోలీసు ఆత్మహత్య చేసుకుంటాడా? పై అధికారుల వేధింపులు అనే కోణం ఎందుకు పట్టించుకోకూడదు? ఇలాంటి బోలెడు ప్రశ్నలు వున్నాయి! ఎస్పై ప్రభాకర్ రెడ్డి కేవలం శిరీష ఆత్మహత్య చేసుకుందనే రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయాడంటే… అంత తేలిగ్గా ఎవరూ నమ్మలేరు. కాని, ప్రస్తుతానికి పోలీసులు చెబుతోంది మాత్రం అదే!

 

శిరీష, ఎస్పైల ఆత్మహత్యల కేసులో అనుమానాల సంగతి ఎలా వున్నా … ఒక్కటి మాత్రం తప్పక గుర్తించాల్సిన సత్యం. ఒక్కసారి వివాహేతర సంబంధం మొదలు పెట్టడం అంటే… ల్యాండ్ మైన్ పైన కాలుపెట్టడం లాంటిదే! ఇక దానిపై నుంచి పక్కకు జరిగి క్షేమంగా బయటపడటం చాలా కష్టం! దాదాపు అసాధ్యం!