బయ్యారం గనులలో ప్రతిపక్షాలు, ఇందిరమ్మ కలలలో ముఖ్యమంత్రి

 

ఒకవైపు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు బయ్యారం గనులలో పడి గిలగిలా కొట్టుకొంటుంటే, దానిని కెలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం హాయిగా అమ్మ హస్తం పట్టుకొని రాబోయే ఎన్నికల తరువాత కూడా తన కుర్చీ తనకే ఖాయం చేసుకోవాలని (ఇందిరమ్మ) కలలు కంటున్నారు. ఇంతవరకు కళంకిత మంత్రుల రాజీనామాకోసం, ముక్యంగా సీబీఐ చార్జ్ షీటులో పేరు నమోదు చేయించుకొన్నసబితా ఇంద్రారెడ్డి రాజీనామా కోసం డిమాండ్ చేసే తీరిక, సమయం రెండూ కూడా ఇప్పుడు ఎవరికి లేవు. ఎందుకంటే అందరు బయ్యారం గనులలో పడి కొట్టుకొంటున్నారు.

 

అంతే కాదు, కరెంటు కోతలు, కరెంటు చార్జీలు, సర్ చార్జీల వడ్డింపుల గురించి కూడా మాట్లాడేందుకు సమయం లేదిప్పుడు. ఇక అటువంటప్పుడు ఎక్కడో మహారాష్ట్ర వాళ్ళు కట్టుకొన్నబాబ్లీ ప్రాజెక్టు గురించి, ఇంకా దూరంలోఉన్న డిల్లీలో జరుగుతున్న అంతులేని తెలంగాణ చర్చల గురించి మాట్లాడే సమయమా ఇది?

 

అందుకే, మంత్రి ధర్మాన ప్రసాదరావు “కిరణ్ కుమార్ తక్కువోడేమి కాడని” ఒక సర్టిఫికేట్ జారీ కూడా చేసారు ఈ మద్యనే. ప్రతిపక్షాల వారినందరినీ ఇంత చక్కగా మరిపించగల బయ్యారం అంశంపై చర్చలు మరికొంత కాలం ఇలాగే సాగిపోతే, ఈ లోపుగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మునిసిపల్ ఎన్నికలకి కూడా చల్లగా ఏర్పాట్లు చక్కబెట్టుకొనే వీలుచిక్కుతుంది.

 

ఒకవేళ ఈలోగా ప్రతిపక్షాలు ఎలాగో ఆ బయ్యారం గనుల(మైకం)లోంచి బయటపడి తాము మోసపోయామని గ్రహించి ఆయనను నిలదీస్తే, “సరే! మీ మాట నేనెందుకు కాదనాలి? అయితే బయ్యారం క్యాన్సిల్ !” అని ఒకే ఒక ముక్కతో ఆటకి షో చెప్పేసి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి మరోకొత్త ఆట మొదలుపెట్టవచ్చును. అందుకే “తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ” అన్నారు.