"చీర"ల కోసం చించుకున్నారు..!

తెలంగాణ పల్లె పండుగ బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో చేనేత, జౌళీ శాఖ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. తెల్లరేషన్ కార్డును ప్రతిపాదికగా తీసుకుని కార్డు ఉన్న ప్రతి ఆడబిడ్డకు చీరలు అందజేయాలని భావించింది. కార్యక్రమం కింద మొత్తం 1,04,57,610 మంది మహిళలకు చీరలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అధికారుల సమన్వయ లోపంతో రసాబాసగా మారింది.

 

క్యూలైన్లలో తలెత్తిన వివాదం..ఒకరినొకరు కొప్పులు పట్టుకుని చెప్పులతో కొట్టుకునే స్థాయికి వెళ్లింది. దీనిలో భాగంగా హైదరాబాద్ యాకత్‌పురా నియోజకవర్గం పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో భారీ స్థాయిలో మహిళలు అక్కడికి చేరుకున్నారు. కనీసం క్యూలైన్లు ఏర్పాటు చేయకపోవడం..గొడవలు జరగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపట్టకపోవడంతో మహిళలు సంయమనం కోల్పోయారు. ఒకరినొకరు గొడవపడి..తోసుకుంటూ జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. పోలీసులు, అధికారులు వారించినప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు..అయితే పోలీసు సిబ్బంది ఎంతో శ్రమకోర్చి మహిళలను అక్కడి నుంచి పంపించివేయడంతో ప్రశాంతత నెలకొంది.