ఎన్నికల డబ్బుల కోసం కిడ్నాప్...కర్ణాటక మహిళా నేత ప్లాన్..

కర్ణాటకలో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రాజకీయాల్లో డబ్బును పంచడం కామన్ థింగే. మరి డబ్బు కావాలంటే ఏం చేస్తారు. పెద్ద పెద్ద రాజకీయ నేతలైతే వాళ్లే పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఏకంగా డబ్బుకోసం కిడ్నాపే చేశారు. యలహంక మాజీ నగర సభ్యుడు, ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లికార్జునప్పను కిడ్నాప్ చేశారు. కర్ణాటకలో ఇప్పుడు ఇది కలకలం రేపుతోంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు..నలుగురిని అరెస్ట్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే...అందులో జేడీఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అర్షియా అలీ కూడా ఉండటం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని భావించిన ఆమె, ఎన్నికల ఖర్చు కోసం ఈ మాస్టర్ ప్లాన్ వేసింది.

 

కాంతరాజ్‌ గౌడ, ప్రసాద్‌, డ్రైవర్‌ ప్రదీప్‌ లను టీమ్ గా చేర్చుకున్న ఆమె, మారణాయుధాలతో వచ్చి మల్లికార్జునప్పను బెదిరించి బలవంతంగా తీసుకెళ్లారు. ఆపై అతని కుమారుడు, డాక్టరుగా పని చేస్తున్న రవికుమార్ కు ఫోన్ చేసి రూ. 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్న ఆయన, డబ్బు ఇస్తానని హామీ ఇచ్చి, తండ్రికి హాని తలపెట్టవద్దని వేడుకున్నాడు. ఆపై రూ. 60 లక్షలు సమకూర్చుకుని, స్నేహితుల సలహా మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యహలంక డీసీపీ గిరీశ్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఆయన కిడ్నాపైన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించింది. మొబైల్ నంబర్ ఆధారంగా హొరమావి ప్రాంతంలో ఉన్న కారు డ్రైవర్ ప్రదీప్ తొలుత పట్టుబడగా, అతనిచ్చిన సమాచారంతో మిగతా వారినీ అరెస్ట్ చేశారు.