ఆపిల్‌కి తాత అరటిపండు

అరటిపండు అన్ని రుతువులలో, అన్ని ప్రాంతాలల్లో దొరికే పండు. శరీరంలో ప్రతి అవయవం మీద ప్రభావం చూపే శక్తి అరటికి వుంది. అందుకే రోజుకి ఒక్క అరటిపండు అయినా తినాలని చెబుతారు. పోషకాల విషయానికి వస్తే నిజానికి ఆపిల్ కన్నా అరటే ముందుంటుందని చెప్పాలి.

 ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు ఆపిల్ కన్నా అరటి పండు నుంచి మనకి  ఎక్కువగా అందుతాయి. ఎవరెవరికి ఈ అరటి మేలు చేస్తుందో చూద్దాం.

 

* రక్తలేమితో బాధ పడేవారికి అరటిని మించిన మందు మరొకటి లేదు. దీనిలో వున్న అధిక ఐరన్ రక్తంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. 

 

* అరటిలో పొటాషియం అధికం. అలాగే ఉప్పు తక్కువ కాబట్టి రక్తపోటుతో బాధపడేవారికి మంచి ఆహరం.

 

* పిల్లలకి మంచి జ్ఞాపకశక్తి కోసం రోజు ఒక అరటిపండు తినిపించాలి. దీనిలోని పొటాషియం మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. బ్రిటన్‌లో జరిపిన ఓ పరిశోధనలో రోజు అరటిపండు తిన్న పిల్లలలో జ్ఞాపక శక్తి కూడా పెరిగినట్టు తేలింది .

 

* ఎసిడిటితో బాధపడే వారికీ అరటిపండు సహజమైన యాంటి ఆసిడ్. అల్సర్లతో బాధపడేవారు కూడా అరటిపండు తింటే ఉపశమనం వుంటుంది. కడుపులోపలి గోడల మీద పొరగా ఏర్పడి ఆమ్లాల ప్రభావాన్ని అరటిపండు తగ్గిస్తుంది.

 

* ఇంపీరియల్ కాలేజీ అఫ్ లండన్‌లో జరిపిన ఓ అధ్యయనంలో రోజూఅరటిపండు తిన్న పిల్లలు మిగతా పిల్లల కంటే  34% తక్కువ అస్తమాకి గురి అయ్యే ప్రమాదం వున్నట్టు తేలింది.

 

* న్యూ ఇంగ్లాండ్ జర్నల్ అఫ్ మెడిసిన్ వారి ప్రకారం ప్రతిరోజూ అరటిపండు తినేవారిలో గుండె జబ్బు, రక్తనాళాలు మూసుకుపోవటం వంటి ప్రమాదాలుదాదాపు 40% తగ్గుతాయి.

 

* ఈ పండులోని విటమిన్ బి నాడుల మీద ప్రభావం చూపి ప్రశాంతతని అందిస్తుంది.అలాగే ఇందులోని విటమిన్ బి 6 రక్తంలోని గ్లూకోజు స్థాయిని నియంత్రిస్తుంది. ఫలితంగా మంచి మూడ్ కలిగివుంటాం.

 

ఇలా అరటిపండు నుంచి మనకి ఎన్నో పోషకాలు లభిస్తాయి . కాబట్టి  చక్కటి ఆరోగ్యానికి రోజుకి ఒక అరటిపండు తినటం మర్చిపోకండి.


-రమ