బాలకృష్ణ రాజ్యసభకు పోటీ చేస్తారా?

 

గతంలో నందమూరి బాలకృష్ణ చాలాసార్లు తను వచ్చే ఎన్నికలలో కృష్ణా జిల్లానుండి శాసనసభకు పోటీ చేస్తానని చెప్పేవారు. కానీ, గత కొంత కాలంగా ఆయన ఆ ఊసు ఎత్తడం లేదు. ఆయన సోదరుడు హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో, ఆయన ఇప్పుడు రాజ్యసభకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు ముహూర్తం (ఏప్రిల్ 4) కూడా ఖాయమయింది గనుక, బాలకృష్ణ రాజ్యసభకు పోటీచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. హరికృష్ణ స్థానంలో బాలకృష్ణకు రాజ్యసభ టికెట్ కేటాయిస్తే పార్టీలో ఎవరికీ అభ్యంతరమూ ఉండదు గనుక, చంద్రబాబు కూడా ఆయనను రాజ్యసభకు పంపేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అదీగాక వచ్చే ఎన్నికలలో శాసనసభ టికెట్స్ కోసం, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో తీవ్రమయిన ఒత్తిడి ఉంటుంది గనుక, బాలకృష్ణను రాజ్యసభకు పంపడమే శ్రేయస్కరమని చంద్రబాబు భావిస్తునట్లు తెలుస్తోంది. కానీ, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున, ఈలోగా లోక్ సభ, శాసనసభకు అభ్యర్ధుల ఎంపిక ఒక కొలిక్కి వస్తే, దానిని బట్టి బాలకృష్ణను రాజ్యసభకు పంపడమా లేక లోక్ సభ లేదా శాసనసభకు పోటీ చేయించడమా? అనేది తేలవచ్చును. ఏమయినప్పటికీ, బాలకృష్ణ వంటి బలమయిన అభ్యర్ధి లోక్ సభ లేదా శాసనసభకు పోటీ చేయడం వలన పార్టీకి లాభం కలుగుతుందని చెప్పవచ్చును.