వెన్నునొప్పికి మాత్రలు పనిచేయవు!


 

నొప్పి లేకుండా బతుకు బండి ముందుకు నడవదు. ఆ నొప్పిని పంటిబిగువున భరిస్తూ ఏదో ఒక మాత్ర వేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. కానీ అన్నివేళలలా నొప్పి మాత్రలు పనిచేయవు సరికదా... వాటి వల్ల లేనిపోని సమస్యలు కూడా తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకు వెన్నునొప్పిని మినహాయింపుగా చూపిస్తున్నారు.


వెన్నెలో ఉండే డిస్క్ అరిగిపోవడం దగ్గర నుంచీ కండరం వాపు వరకు వెన్నునొప్పికి కారణం ఏదైనా కావచ్చు. ఇలా నొప్పి చేసినప్పుడు ఆస్పిరిన్‌, బ్రూఫిన్ వంటి నొప్పి మందులు వాడుతూ ఉంటాము. ఈ తరహా మందులను Nonsteroidal anti-inflammatory drugs (NSAID) అంటారు. ఇవి వాపుతో పాటుగా నొప్పిని కూడా తగ్గిస్తాయన్నమాట. ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు వెన్నునొప్పిలో NSAID ఫలితం ఏమేరకు ఉంటుందో గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వాళ్లు 6000 మంది రోగులని పరిశీలించారు.


ప్రతి ఆరుగురు రోగులలో ఒక్కరికి మాత్రమే నొప్పి మాత్రలు పనిచేస్తున్నట్లు తేలింది. మిగతావారిలో ఈ మాత్రలు ప్రభావం చూపకపోగా జీర్ణసంబంధమైన సమస్యలు మొదలవడాన్ని గమనించారు. అల్సర్లు ఏర్పడటం, పేగులలో రక్తస్రావం జరగడం లాంటి తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయట. ఇక నొప్పి మాత్రలతో లివర్, కిడ్నీ వంటి అవయవాలు దెబ్బతినే అవకాశం ఎలాగూ ఉంది.


ఇకమీదట వెన్నునొప్పి వచ్చినప్పుడు నొప్పి మాత్రల మీద ఆశలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. దీనికి బదులుగా కాపడం పెట్టుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, చిన్నపాటి వ్యాయామాలు చేయడం, ఫిజియోథెరపీ చేయించుకోవడం వంటి చికిత్సలను అనుసరించి చూడమంటున్నారు.

 

- నిర్జర.