మాయల మరాఠీ పాలిటిక్స్!

 

 Babli project issue, telangana, Sharad Pawar, Ajit Pawar, chandrababu

 

 

మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రైతుల ఉసురు పోసుకుంటోంది. కీలక సందర్భాల్లో ప్రాజెక్ట్ గేట్లు మూసేస్తూ తెలంగాణ రైతు కంట కన్నీరు వచ్చేలా చేస్తోంది. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశాధినేత చంద్రబాబునాయుడు గతంలో భారీ ఉద్యమం నడిపారు. మహారాష్ట్ర సరిహద్దులకు వెళ్ళి ప్రాణాలకు తెగించి మరీ ఉద్యమించారు. చంద్రబాబు మీద ఆ కృతజ్ఞత తెలంగాణ రైతుల్లో వుంది.

 

త్వరలో మళ్ళీ తెలంగాణ రైతులకు బాబ్లీ ప్రాజెక్ట్ ద్వారా కష్టాలు రాబోతున్నాయి. ఈనెల 29న బాబ్లీ గేట్లను తానే స్వయంగా మూసివేస్తానని, తెలంగాణా రైతులు అడ్డుకున్నా ఆగేది లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ ప్రకటించారు. ఈ అజిత్ పవార్ ఎవరో కాదు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మరాఠా యోధుడు శరద్ పవార్‌కి స్వయానా సోదరుడి కొడుకు.



ఒకపక్క ఎన్.సి.పి. నేత శరద్ పవర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, తెలంగాణ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వుంటారు. మరోపక్క ఆయన సోదరుడి కొడుకు, ఆయన పార్టీకే చెందిన అజిత్ పవార్ తెలంగాణ రైతుల కంట కన్నీరు తెప్పించడానికి సిద్ధమవుతూ ఉంటాడు.



ఈ ద్వంద్వ వైఖరిని ఏమని పిలవాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటూ శరద్ పవార్ కపటప్రేమ చూపిస్తున్నారని అనుకోవాలా? మాయల మరాఠీ పాలిటిక్స్ ఇలాగే వుంటాయనుకుని ఊరుకోవాలా? ఈసారి బాబ్లీ కష్టాల నుంచి తెలంగాణ రైతులను ఘనత వహించిన విభజనవాదులు ఎలా కాపాడతారో వేచిచూడాలి.