చంద్ర బాబుపై కేసు.. విచారణ నేడే

 

బాబ్లీ నిర్మిస్తే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందంటూ 2010లో టీడీపీ ఎమ్మెల్యేలతో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆందోళన చేశారు.బాబ్లీ నిర్మాణం ఆపివేయాలని తెలంగాణ సరిహద్దు దాటి టీడీపీ బృందం చంద్రబాబు నేతృత్వంలో అప్పట్లో మహారాష్ట్రకు వెళ్లింది.తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించగానే ధర్నా చేస్తున్న చంద్రబాబును మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. 40మంది ఎమ్మెల్యేలతో వెళ్లిన చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు ఐటీఐ కళాశాలలో ఉంచారు. ఆ తర్వాత బలవంతంగా విమానం ఎక్కించి చంద్రబాబును, టీడీపీ ఎమ్మెల్యేలను మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ పంపించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేలందరిపై లాఠీచార్జ్ కూడా జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో చంద్రబాబు, ఆయన వెంట వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలపై ధర్మాబాద్‌లో కేసులు నమోదయ్యాయి.నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు.

నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్ ఉండటంతో అమలు చేయాలని అక్కడి కోర్టులో మహారాష్ట్ర వాసి పిటిషన్ వేయడంతో ఎనిమిదేళ్ల కిందటి బాబ్లీ ప్రాజెక్టు కేసు తెరపైకి వచ్చింది.మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ కోర్టు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు 16 మందిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది.దీనిపై న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం రీకాల్‌ పిటిషన్‌ వేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.దీంతో చంద్రబాబుపై జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను రద్దు చేయాలంటూ న్యాయవాదులు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టులో రీకాల్‌ పిటిషన్‌ వేశారు.దీనిపై నేడు విచారణ జరగనుంది.చంద్రబాబు తరుపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్ధ లూత్రా వాదనలు వినిపించనున్నారు.