శివాలెత్తి విజయం సాధించిన ప్రతీ బాహుబలి వెనుకా… ఒక శివగామి!

 
బాహుబలి సినిమాలోని పాత్రలు భారత, రామాయణాలు, పురాణల్లోంచి ప్రేరణతో రూపొందించారని మనకు తెలిసిందే! ఖచ్చితంగా పురాణకథని ఫాలో అయిపోకున్నా… జక్కన్న తనదైన స్టైల్లో మైథాలజీని, ఫిక్షన్ తో మిక్స్ చేశాడు. అలా పుట్టిందే రాజమాత శివగామి పాత్ర! ఆమె… బాహుబలి తల్లి కాదు. బాహుబలి పెంపుడు తల్లి! విలన్ భల్లాలదేవుడికి స్వంత తల్లి! కాని, అటు బాహుబలి , ఇటు ప్రేక్షకులు ఎక్కడా శివగామిని అలా భావించరు! మనవడు శివుడ్ని చేతుల్లో పట్టుకుని నీటిలో మునిగిపోయిన శివగామి బాహుబలి 2లో ఏం చేస్తుందో కాని… బాహుబలి ది బిగినింగ్ లో మాత్రం మెస్మరైజ్ చేసేసింది!

 

శివగామి ధృతరాష్ట్రుడి లాంటి అవిటి బిజ్జలదేవుడకి భార్య. కాని, ఆమె గాంధారిలా కళ్లకు బట్టలు కట్టుకుని అన్యాయాన్ని చూడకుండా కూర్చోదు. అమరేంద్ర బాహుబలిని అతడి తల్లి పురిట్లో అప్పజెప్పి మరణిస్తే… మాద్రి అప్పజెప్పిన నకుల, సహదేవుల్ని పెంచి పెద్ద చేసిన కుంతిలా బాహుబలిని పెద్దవాడ్ని, ప్రయోజకుడ్ని చేస్తుంది! బాహుబలి విజయాల్లో, వ్యక్తిత్వంలో శివగామి ప్రభావం బోలెడు. ఇలా తల్లి చేత ప్రేరేపింపబడ్డ చారిత్రక ధీరులు ఎందరో! అమ్మ తలుచుకుంటే అమ్ముల పొదిలోంచి వదిలిన రామ బాణంలా తయారు చేయగలదు తనయుడ్ని!

 

తన పుత్రుడ్ని హైందవ సామ్రాజ్య బాహుబలిగా తీర్చిదిద్దని మహా మాత… జిజియా భాయి! ఆమె ఛత్రపతి శివాజీని కని వుండకపోతే… ఇవాళ్ల మన భారతదేశం ఈ రూపంలో వుండేదే కాదు! ఇక మరో చారిత్రక పురుషుడు, యుగపురుషుడు… శాతకర్ణి గురించి చెప్పేదేముంది? ఆయనపై తల్లి గౌతమీ బాలాశ్రీ ప్రభావం ఎంతంటే… తన పేరునే… గౌతమీపుత్ర శాతకర్ణిగా మార్చేసుకున్నాడు! భరతమాత గమనం మీద ఆయన ప్రభావం ఎంతటిదో… ఆయన మీద ఆయన మాతృశ్రీ ప్రభావం అంతటిదే!

 

రాజులే కాదు… వివేకానందుడైన నరేంద్రుడి మీదా ఆయన తల్లి భువనేశ్వరీ దేవీ ప్రభావం అమోఘం! ఇప్పుడు నమోన్నమః అనిపించుకుంటోన్న నరేంద్రుడి మీద కూడా ఇంటింటా పనులు చేసి పెంచిన… ఆయన తల్లి హీరాబేన్ ప్రభావం అద్వితీయం! మనకు తెలిసిన ఇలాంటి తనయులు కొందరే… తెలియని బాహుబలులు ఎందరో! ప్రతీ బాహుబలి వెనుక ఒక శివగామి ఖచ్చితంగా వుంటుంది! ఆ శివగామే.. పుత్రుడి గమనాన్ని శాసిస్తుంది!