అయేషామీరా హత్య కేసు... హైకోర్టు సంచలన తీర్పు....

 

అయేషామీరా హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయేషా మీరా హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. దాదాపు పదేళ్ల క్రితం సంచ‌ల‌నం సృష్టించిన ఆయేషామీరా హ‌త్య‌కేసు ఇప్ప‌టికి ఓ కొలిక్కి రాలేదు. ఈ కేసులో స‌త్యంబాబు అనే అమాయ‌కుణ్ని ఇరికించి, అస‌లు దోషుల‌ను బ‌య‌ట‌ప‌డేయ‌డానికి పోలీసులు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే హైకోర్టు జోక్యంతో ఆ దారుణానికి తెర‌ప‌డింది. ఆయేషా మీరా హ‌త్య‌కేసును మ‌ళ్లీ ద‌ర్యాప్తు చేయాల‌ని హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ర‌మేశ్ రంగ‌నాథ‌న్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం తీర్పువెలువ‌రించింది. ద‌ర్యాప్తు నివేదిక‌ను ఏప్రిల్ 20లోగా స‌మ‌ర్పించాల‌ని పోలీస్ శాఖ‌ను ఆదేశించింది. కేసు ద‌ర్యాప్తును త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని, అప్ప‌టిదాకా పోలీస్ అధికారుల‌ను మార్చొద్ద‌ని స్ప‌ష్టంచేసింది.

 

మరోవైపు దీనిపై అయేషా తల్లి స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆయేషా హ‌త్య‌కు, స‌త్యంబాబుకు సంబంధం లేద‌ని తాము మొద‌టినుంచీ చెబుతున్నా… ఎవ‌రూ వినిపించుకోలేద‌ని, అమాయ‌కుడిని దోషిగా చూపించే ప్ర‌య‌త్నంచేశార‌ని... తన కూతుర్ని పాశ‌వికంగా హ‌త్య‌చేసిన దోషులు ఇప్ప‌టికీ త‌ప్పించుకుతిరుగుతున్నార‌ని, హైకోర్టు ఆదేశాల‌తో వారికి శిక్ష ప‌డుతుంద‌ని విశ్వాసం వ్య‌క్తంచేస్తున్నామని అన్నారు.