హెల్మెట్ పెట్టుకోలేదని ఆటో డ్రైవర్ కు ఫైన్.. విజయవాడ పోలీసుల ఘనత

 

 

కొత్తగా వచ్చిన మోటార్ వెహికల్ యాక్ట్ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. తమ వాహనాల విలువ కంటే కూడా ఎక్కువ ఫైన్ ఎక్కువ కావడంతో తమ వాహనాలను  రోడ్ మీదే వదిలి వెళ్లిపోతున్నారు కొంత మంది. దీనికి తోడు కొంత మంది పోలీసుల అత్యుత్సాహం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది.  ఈ పరిస్థితులలో ఏపీలోని విజయవాడ మహా నగరం మరో సంచలన వార్తకు వేదిక అయ్యింది.   విజయవాడ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపీ 16 టీఎస్ 8597 నంబర్ తో తిరుగుతున్న ఆటోపై ట్రాఫిక్ పోలీసులు చలానా వేశారు.  అయితే అది సిగ్నల్ జంప్ చేసినందుకో, ఓవర్ లోడ్ తో వెళుతున్నాడనో కాదు. ఆ ఆటో డ్రైవర్ ఆటో నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేశారట. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆటో డ్రైవర్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఐతే ఈ వ్యవహారం మీడియా ద్వారా ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో కొన్ని సాంకేతికలోపాల కారణంగా ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే సమస్యలను పరిష్కరిస్తాం’ అని మెల్లగా చెప్పారు ఆ అధికారులు.