ఆసీస్ క్రికెటర్లపై దాడి... మనపై గెలిచారనా..?

ఎన్నో ఆశలతో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ జట్టును కోహ్లీసేన ఉతికి ఆరేసింది. వన్డే సిరీస్‌లో ఒకే ఒక్క వన్డే మినహా అన్ని గెలుచుకొని తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. టీ20ల్లోనూ.. అదే ఆటతీరుతో ఆసీస్‌‌పై పై చేయి సాధించింది. అయితే రెండో టీ20లో ఎవ్వరూ ఊహించని విధంగా భారత్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి జరగడం కలకలం రేపింది. రెండో టీ20 అనంతరం ఆసీస్ క్రికెటర్లు బస్సులో హోటల్‌కు బయలుదేరారు.. మార్గమధ్యంలో వీరి బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.  ఆ సమయంలో విండో సీట్‌లో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ దాడిని టీమిండియా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు చేశారా..? లేక మరేవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్లకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.