ఏటీఎంలలో డబ్బు కొరత... మూడు రోజులు ఆగాల్సిందే..

 

ఏటీఎంలలో డబ్బు కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నగదు కొరతపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి ఎస్పీ శుక్లా స్పందిస్తూ, తమ వద్ద రూ. 1.25 లక్షల కోట్ల కరెన్సీ ఉందని, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కరెన్సీ, మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కరెన్సీ ఉన్న కారణంగా ఇబ్బందులు వచ్చాయని, తాను ఏర్పాటు చేసిన రాష్ట్రాల కమిటీలు, ఆర్బీఐ ఈ నగదును సమానంగా అన్ని రాష్ట్రాలకూ చేరుస్తుందని తెలిపారు. ఇది జరిగేందుకు కనీసం మూడు రోజులు పడుతుందని, ప్రజలు ఓపికతో ఉండాలని సూచించారు. మరోవైపు బ్యాంకులకు వచ్చే డిపాజిట్లతో పోలిస్తే, ఏటీఎంల నుంచి విత్ డ్రాలు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని బ్యాంకులు చెబుతున్నాయి. తాము పక్క రాష్ట్రాల నుంచి కూడా డబ్బును తెప్పించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయత్నిస్తున్నామని, అతి త్వరలోనే ఏటీఎంలలో క్యాష్ నింపే ప్రయత్నం చేస్తామని తెలిపారు.