నెహ్రూ, ఇందిరాగాంధీలతో వాజ్‌పేయి ఇలా ఉండేవారా..!!

 

ఇప్పటి రాజకీయ నాయకులు చాలామంది ఒకరిమీద ఒకరు అర్ధంపర్థం లేని ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాల విలువ తగ్గిస్తున్నారు కానీ ఒకప్పుడు అలా కాదు.. సిద్ధాంత పరంగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేసినా, వ్యక్తిగతంగా మాత్రం మంచిగా ఉంటూ విలువైన రాజకీయాలు నడిపేవారు.. అలాంటివారిలో ముందువరుసలో ఉంటారు వాజ్‌పేయి.. నెహ్రూ, ఇందిరాగాంధీలను సిద్ధాంతపరంగా వ్యతిరేకించినా.. వారు మంచి చేస్తే వాజ్‌పేయి ప్రశంసించేవారు.

 

 

నెహ్రూకి కూడా వాజ్‌పేయి అంటే అభిమానం ఉండేదట.. భారత పర్యటనకు వచ్చిన విదేశీ అతిథిలకు, ప్రధానమంత్రిలకు వాజ్‌పేయిని పరిచయం చేస్తూ.. 'ఈయన ఎదుగుతున్న విపక్ష నాయకుడు.. నన్ను ఎప్పుడూ విమర్శిస్తుంటారు.. నా దృష్టిలో ఆయన మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు.. భవిష్యత్తులో ప్రధాని కాగల వ్యక్తి' అని నెహ్రూ చెప్పిన సందర్భాలు ఉన్నాయట.. అలాగే వాజ్‌పేయి కూడా నెహ్రూను గౌరవించేవారు.. 1977లో వాజ్‌పేయి విదేశాంగ మంత్రిగా పదవి చేపట్టాక, సౌత్ బ్లాక్‌లోని తన కార్యాలయానికి వెళ్లగా అక్కడ గోడపై ఉండాల్సిన నెహ్రూ చిత్రపటం లేకపోవడాన్ని గమనించారు.. వెంటనే ఆయన నెహ్రూ చిత్రపటం ఎక్కడ ఉండేదో దానిని అక్కడే ఉంచాలని ఆదేశించారట.

 

 

అలానే ఓ సారి వాజ్‌పేయి ఇందిరాగాంధీని దుర్గాదేవి అవతారంగా అభివర్ణించారు.. బంగ్లాదేశ్ విమోచన పోరాటం నేపథ్యంలో 1971లో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగింది.. ఉత్తర భారతదేశంపై పాకిస్తాన్ తొలుత వైమానిక దాడులు చేయడంతో భారత్ యుద్ధ క్షేత్రంలోకి దిగింది..అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పలు దేశాల మద్దతు సంపాదించడంతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి అయి వెనకడుగు వేసింది.. ఈ యుద్ధం దక్షిణాసియా రాజకీయ చిత్రంలో భారత్‌ను బలీయ శక్తిగా మార్చింది.. ఈ యుద్ధం తరువాత రాజ్యసభలో వాజ్‌పేయి మాట్లాడుతూ ఇందిరాగాంధీని దుర్గాదేవి అవతారంగా అభివర్ణించారు.. విపక్షంలో ఉన్నప్పటికీ ప్రధాని స్థానంలో ఉన్న ఇందిరాగాంధీ తెగువను ప్రశంసించడానికి ఏమాత్రం సందేహించని వాజ్‌పేయిని చూసి ఈ తరం చాలా నేర్చుకోవాలి.