చేతివాటానికి చురుకుదనానికి సంబంధమేంటి...?

 

 

ఒక వ్యక్తి చేతివాటానికి, ఆ వ్యక్తి చురుకుదనానికి సంబంధం ఉందంటే మీరు నమ్ముతారా? కానీ సంబంధం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు. కుడిచేతివాటం కంటే ఎడమచేతివాటం వాళ్ళు వేగంగా ఆలోచిస్తారని, సంక్లిష్ట పరిస్థితుల్లో తొందరగా నిర్ణయాలు తీసుకుంటారనీ చెబుతున్నారు.

ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో భాగంగా..100 మంది కుడి, ఎడమ చేతివాటం ఉన్న వాళ్ళను ఎంపిక చేసుకొని, ప్రతీ వ్యక్తికి ఎదురుగా ఒక బోర్డుమీద రెండు వైపులా వేరు వేరు అక్షరాలను రాసి వాటిని జత చేయమని చెప్పారు. ఇలాంటి పనులు చేసేటప్పుడు మన కుడి, ఎడమ భాగాలు రెండిటినీ ఒకేసారీ ఉపయోగించుకుంటుంది. కొన్ని పరికరాల ద్వారా ప్రతీ వ్యక్తి అక్షరాలు జత చేయటానికి తీసుకుంటున్న సమయం, ఆ సందర్భంలో ఆ వ్యక్తి మెదడులో కలిగే మార్పులను శాస్త్రవేత్తలు గమనించారు. ఈ ఫలితాల్లో ఎడమ చేతి వాటం వాళ్ళు కుడి చేతి వాటం వాళ్ళకంటే 43 మిల్లి సెకండ్లు ముందుగానే లక్ష్యాలను సాధించారని తెలిసింది.

ఈ పరిశోధన గురించి నిక్ అనే శాస్త్రవేత్త తెలియజేస్తూ.. ఎడమచేతివాటం వాళ్ళ మెదడులోని ఎడమ, కుడి భాగాల మధ్య సమాచారం చాలా సులువుగా సమన్వయం చేసుకోనగలుగుతున్నారు. దీనివల్లే ఒకే సమయంలో ఎక్కువ లక్ష్యాలను వేగంగా చేరుకునే సామర్ధ్యం వారికి ఉంటుందని తెలిసింది" అని అన్నారు.

- రమ