జగన్‌కి అశోక్‌బాబు షాక్!

 

 

 

ఏపీఎన్జీవోల ఎన్నికలలో అశోక్‌బాబు సాధించిన ఘన విజయాన్ని కేవలం ఉద్యోగులకు సంబంధించిన విషయంగానే రాజకీయ పరిశీలకులు భావించడం లేదు. రాజకీయ ఎత్తులు, పై ఎత్తులను అధిగమిస్తూ సాధించిన విజయంగా భావిస్తున్నారు. ఉద్యోగులు సమైక్య ఉద్యమం జరిపిన సమయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ అశోక్‌బాబును తనకు అనుకూలంగా మాట్లాడే విధంగా ప్రేరేపించారు. అయితే దానికి అశోక్‌బాబు అంగీకరించకపోవడంతో ఆయన మీద అప్పటి నుంచే రాజకీయాలు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు ఏపీ ఎన్జీవోల ఎన్నికల సందర్భంగా ఆ రాజకీయాలు మరింత ముదిరి అశోక్‌బాబుకు పోటీగా ఒక అభ్యర్థి నిలబడేంత వరకూ పరిస్థితి వెళ్ళిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

సమైక్య ఉద్యమాన్ని ఎంతో అభినందనీయంగా నడిపిన ఏపీ ఎన్జీవోలలో ఐక్యత దెబ్బతినేలా చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని అంటున్నారు. అయితే అశోక్‌బాబుకు ఘన విజయం అందించడం ద్వారా ఏపీ ఎన్జీవోలు తమలో ఐక్యత అలాగే వుందని చెప్పారని అంటున్నారు. మొత్తమ్మీద అశోక్‌బాబు సాధించిన విజయం జగన్‌కు ఒక షాక్‌లా భావించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఎపీ ఎన్జీవోల ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి దశలోనూ జగన్ వర్గం అశోక్‌బాబుకు వ్యతిరేకంగా పనిచేసింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల  సందర్భంలో ఎన్ని వ్యూహాలు రచిస్తారో అన్ని వ్యూహాలు రచించారు. అశోక్‌బాబుకు వ్యతిరేకంగా బాహాటంగానే అన్ని పనులూ చేశారు. చివరకు ఈ ఎన్నికలు అశోక్‌బాబు వెర్సెస్ జగన్ అన్నట్టుగా తయారయ్యాయి.



అయితే జగన్ ఎన్ని ప్లానులు వేసినా అశోక్‌బాబు ఎంతమాత్రం నిబ్బరాన్ని కోల్పోకుండా వ్యవహరించడం అభినందనీయమైన అంశమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అశోక్‌బాబు సాధించిన విజయం వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కున్న డబ్బు, పలుకుబడిని దెబ్బతీశాయని భావిస్తున్నారు. సమైక్య ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న అశోక్‌బాబుకు వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా జగన్ సీమాంధ్ర ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకిగా మారారు. ఈ ప్రభావం రాబోయే ఎన్నికల మీద వుండే  అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. అశోక్‌బాబును వ్యతిరేకించి జగన్ తేనెతుట్టెను కదిపారని విశ్లేషిస్తున్నారు.