రోహింగ్యాలు ఉంటే అమిత్ షా ఏం చేస్తున్నారు? బీజేపీకి అసద్ కౌంటర్ 

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతలు హాట్ కామెంట్స్ తో గ్రేటర్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎంఐఎం టార్గెట్ గా బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. ఎంఐఎంకు ఓటు వేస్తే టీఆర్‌ఎస్ లబ్ధి పొందుతుందన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో 30 నుంచి 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నారన్న బీజేపీ ఆరోపణలు చేస్తోందని చెప్పిన అసద్.. రోహింగ్యాల పేర్లు ఓటర్ల జాబితాలో ఉంటే మరి దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్‌షా ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. అమిత్ షా నిద్రపోతున్నారా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అంత మంది రోహింగ్యాలు ఓటర్ల జాబితాలోకి ఎలా వచ్చారని అమిత్ షా ఎందుకు విచారణ జరపించట్లేదని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆ రోహింగ్యాలు ఎవరో బీజేపీ వెల్లడించాలని అన్నారు. విద్వేషం సృష్టించడమే బీజేపీ నేత ఉద్దేశమని అసద్ ఆరోపించారు.