హోదా ఇవ్వలేం..ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం

 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీస్తున్న టీడీపీ ఎంపీలు..పార్లమెంట్ సమావేశాల్లో మరోమారు కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం కూడా మరోమారు తేల్చిచెప్పింది. ప్రత్యేక ప్యాకేజీ ఇప్పటికే ప్రకటించామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సమాధానమిచ్చింది. ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్‌ రాజ్యసభలో ప్రశ్న అడిగారు. హోదా ఇవ్వకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ.. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. విదేశీ సంస్థల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. 14 వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా అమలులో లేదని తెలిపారు. 

మరోవైపు ప్రత్యేకహోదాతోపాటు విభజన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ఆవరణలో టీడీపీ ఎంపీలు నిరసన కొనసాగించారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర వైఖరికి నిరసనగా  పార్లమెంట్ ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టాలని ఎంపీ నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు ఉదయం గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. పార్లమెంట్ ముగిసే వరకు ఆయన దీక్ష కొనసాగనుంది.