రిపబ్లిక్ టీవీ సర్వే వెనుక మోడీ మైండ్ గేమ్..?

 

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో వస్తున్న ఆదరణతో ఈ సారి కూడా అధికారం తమదేనని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్న వేళ.. అలా జరిగితే తమ పార్టీ మనుగడ కష్టమని.. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని జగన్ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్న సమయంలో వెలువడిన ఒక సర్వే రిజల్ట్.. టీడీపీకి షాక్‌ని.. వైసీపీకి మంచి బూస్ట్‌ని అందించింది. 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, సీ ఓటర్ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలిపింది.

 

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. అదే సమయంలో ఇతరులకు అంటే.. ఏపీలో మరో పార్టీ లేదు కాబట్టి వైసీపీకి 13 స్థానాలు వస్తాయని తేల్చింది. రిపబ్లిక్ టీవీ వెలువరించిన కథనంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ మైండ్ గేమ్‌కు చిత్తవుతున్న వేళ.. తమ పార్టీకే ప్రజాదరణ దక్కుతుందని కథనం రావడం పెద్ద బూస్టప్ ఇచ్చినట్లే. ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్న టైంలో ఇలాంటి వార్తలు రావడం వెనుక ఏదో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

సర్వే నిర్వహించిన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి బీజేపీ పక్షపాతి అన్నది ఓపెన్ టాక్. సీట్‌లో ఎంతటి వారున్నా సరే తన వాగ్ధాటితో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించే అర్నాబ్‌... 2014 ఎన్నికల సమయంలో మోడీని చేసిన ఇంటర్వ్యూతో తాను ప్రధానికి పరమ భక్తుడిని అని చెప్పకనే చెప్పాడు. తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎన్డీఏ 335 సీట్లు సాధిస్తుందని చెప్పి బీజేపీ భజన చేసిన అర్నాబ్‌‌.. మరి అదే ఎన్డీఏ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని తక్కువ చేసి చూపడం అనుమానాలకు తావిస్తోంది. పోలవరం స్పిల్ వే టెండర్లను నిలిపివేయాల్సిందిగా ఏపీ సర్కార్‌ను కేంద్రప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశించిందో అప్పటి నుంచి బీజేపీ-మోడీ‌ బంధం తెగిపోవడానికి కౌంట్‌డౌన్ స్టార్టయ్యిందని అందరూ భావించారు.

 

అందుకు తగ్గట్టుగానే నిధులివ్వమంటే ఇవ్వరు.. మా బాధలు మేం పడి పనులు పూర్తి చేసుకుంటుంటే మీకు ఎందుకు అంత నొప్పి అంటూ కొంతమంది టీడీపీ నేతలు బీజేపీని ఓపెన్‌గానే కార్నర్ చేస్తున్నారు. మరి వాళ్లు తక్కువ తింటారా..? టీడీపీకి బలంగానే కౌంటర్ వేస్తున్నారు. చంద్రబాబు కూడా మోడీతో తాడో పేడో తేల్చుకుంటారని.. ఢిల్లీ టూర్‌లో మొత్తం తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. తీరా సీఎం.. పీఎంలు గంటపాటు రాష్ట్ర సమస్యల గురించి చర్చించుకున్నారు.. నవ్వుతూ బయటకు వచ్చారు. తాము ఎంతగా ప్రయత్నిస్తున్నటికీ బాబును ఆపడం సాధ్యం కాకపోవడంతో బీజేపీ పెద్దలు అర్నాబ్‌ను రంగంలోకి దించారట. తద్వారా ఎన్నికలు దగ్గరపడే లోగా చంద్రబాబు నైతిక స్థైర్యాన్నీ దెబ్బ తీయాలన్నది కమల నాథుల మైండ్‌గేమ్‌గా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ గేమ్‌లో ఫస్ట్ స్టెప్‌‌లో భాగంగానే సర్వే చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.