పంచాయితీ కార్యదర్శుల పంచాయితీ.. రంగులు వేసిన నిధులు కూడా ఇవ్వని ఏపీ ప్రభుత్వం

 

 

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయాల సుందరీకరణ ఉత్తర్వులపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. నిధులు లేవంటూ పంచాయతీ కార్యదర్శుల మండిపడుతున్నారు. అప్పు చేసి రంగులు వేపిస్తే ఇప్పుడు బిల్లులు రాక లబోదిబోమనే పరిస్థితి నెలకొంది.పంచాయతీల పట్ల ప్రభుత్వం తీరు చూస్తుంటే.. తినటానికి తిండి లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె అన్న సామెత గుర్తుకొస్తుంది. వాటికి ఇవ్వాల్సిన నిధులను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుని రోజుకొక ఆదేశంతో పంచాయతీల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్రామ సచివాలయాలకు పెయింటింగ్ వేయించాలంటూ పంచాయతీ కార్యదర్శులకు తాఖీదులు అందాయి. మరి నిధులు ఎలాగంటే ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టు ఉన్నతాధికారుల వైఖరి ఉంటున్నదని కార్యదర్శుల వాపోతున్నారు. గ్రామాభివృద్ధి కోసం సొంత డబ్బులను పెట్టి.. ఇంట్లో వస్తువులు కుదువుపెట్టి.. పనులు చేయించి ఆ బిల్లులు క్లియర్ కాక  కలత చెందుతున్నారు. పదకొండు నెలలుగా బిల్లులు చెల్లించక పోవడంతో గ్రామ పంచాయితీలు కష్టాల్లో పడ్డాయి. మేజర్ పంచాయతీల్లో సీఎఫ్ఎంఎస్ ఓపెన్ కాకపోవడం, మైనర్ పంచాయతీల్లో ఆ మేర నిధులు లేకపోవటంతో భారమంతా కార్యదర్శుల పైనే పడింది. జేబులోంచి డబ్బులు పెట్టి అప్పుల పాలై బంగారం కుదువ పెడుతున్నారు. 2018-19 సంవత్సరానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం విడుదల చేసిందని.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంచుకుని ఒక్క బిల్ కూడా చెల్లించడం లేదంటూ పంచాయతీ కార్యదర్శుల వాపోతున్నారు. మూడు నెలల కిందట కొన్ని బిల్లులు చెల్లించారు కానీ చాలా పెండింగ్ లో ఉన్నాయంటున్నారు. గ్రామాల్లో ఎవరో ఒకరితో తాగునీటి మోటార్ల రిపేర్లు పైప్ లైన్ మరమ్మతులు చేయిస్తున్నారు. అయితే వారికి నెలల తరబడి చెల్లింపులు చేయ లేకపోతున్నామన్నారు. చాలామంది కార్యదర్శులు జనం ముందుకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో కొందరు కార్యదర్శుల సొంత డబ్బు పెట్టి తాగు నీటి సరఫరా కోసం ట్యాంకర్లను తెప్పించారు. ఆ బిల్లులు తడిచి మోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పనులకు జేబులోంచి ఖర్చు చేసి సీఎఫ్ఎంఎస్ ద్వారా పంపినప్పటికీ ఫైనాన్స్ లో బిల్లులు పెండింగ్ లో పెట్టారని తెలియజేసారు.ఒక్కో గ్రామ పంచాయితీలో కనీసం లక్ష రూపాయల మేరకు బకాయిలు ఇవ్వాల్సి ఉందని చెప్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టామని వాటికి నిధులు ఇచ్చేవారు లేక సొంతంగా మొబిలైజ్ చేసుకోవాల్సి వస్తుందని కార్యదర్శుల అంటున్నారు.స్థానిక సంస్థ ల ఎలక్ట్రోరల్ జాబితా తయారీపై ఆయా పంచాయతీల నిధుల నుంచి భరించాలని కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఆదేశించారు. ఇందుకు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో తెలియక కార్యదర్శులు ఇప్పుడు తలలు పట్టుకున్నారు. గ్రామ పంచాయతీల సర్పంచ్ ల పదవీ కాలం గత ఏడాది ఆగస్టుతో ముగిసింది. అప్పటి నుంచి వాటికి ఎన్నికలు జరగక పోవడంతో 2018-19 ఏడాదికి సంబంధించి 14గో ఆర్థిక సంఘం నిధుల రెండో విడత 2019-20 కి సంబంధించిన నిధులను కేంద్రం నిలిపి వేసింది. గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగితేనే రాష్ట్రానికి ఈ నిధులు అందుతాయి. ఇలా రావల్సిన నిధులు కేంద్రం నుంచి రాకపోవటం.. ఉన్న నిధులు రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంచుకుని విడుదల చేయకపోవడంతో పంచాయతీల ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాయని కార్యదర్శుల చెబుతున్నారు.