ఆంధ్ర ప్రదేశ్ లో అర్చకులకు రూ.5,000 ప్రభుత్వ సాయం

నెలవారీ జీతం, ధూప దీప నైవేద్యం ద్వారా లబ్ధి పొందని వారికి ఈ పధకం వర్తిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన - చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. దేవదాయ శాఖ నుంచి ఎలాంటి నెలవారీ జీతాలు పొందని, ధూప దీప నైవేద్యం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందని వారికి అర్చక సంక్షేమ నిధి నుంచి ఈ సాయాన్ని చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ పధకం వల్ల  2,500 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుంది.

లాక్‌డౌన్‌ కారణంగా దేవాలయాలలోకి భక్తులను అనుమతించడం లేదు. ప్రస్తుతం అర్చకులు మాత్రమే ఏకాంతంగా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో చిన్న దేవాలయాలలో ఎలాంటి ఆదాయ వనరులు లేని కారణంగా అర్చకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ధూప దీప నైవేద్యం, అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా 2,800 మందికి పైగా అర్చకులకు ప్రతి నెలా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది. ఈ రెండు పథకాలూ వర్తించని వారు రాష్ట్ర వ్యాప్తంగా 2,500 మంది దాకా పలు ఆలయాల్లో పనిచేస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా ఒక్కొక్కరికి రూ. 5000 గ్రాంటు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం కారణంగా అర్చక సంక్షేమ నిధిపై సుమారు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల భారం పడనుంది.