టీడీపీలోనే కొనసాగుతా... క్లారిటీ ఇచ్చిన గంటా!!

 

మాజీ మంత్రి, ప్రస్తుత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీకి భారీ షాక్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గంటా శ్రీనివాసరావు, మరో 15 మంది ఎమ్మెల్యేలతో కలసి టీడీపీకి గుడ్ బై కొట్టనున్నట్టు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలతో కలసి గంటా శ్రీలంకలో ఉన్నారని, వారంతా శ్రీలంక నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకోనున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో టీడీపీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంతో విస్మయానికి గురైన టీడీపీ శ్రేణులు గంటా సారథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే నిజంగానే బీజేపీలో చేరతారా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. అదే జరిగితే చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా పోతుందని ఆందోళన చెందారు.

అయితే ఈ ఊహాగానాలపై స్పందించిన గంటా శ్రీనివాసరావు తాను టీడీపీలోనే కొనసాగుతానని వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను టీడీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, టీడీపీలోనే కొనసాగుతానని వివరించారు. శక్తి పీఠాన్ని దర్శించుకోవడానికే తాను శ్రీలంక వెళ్లానని అన్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.