అందుకే విజయవాడ వద్ద రాజధాని!

 

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనుకొంటోందనే విషయాన్ని ఈరోజు శాసనసభలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రభుత్వం విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నందున ఆ ప్రకటన కేవలం లాంచనమేనని భావించవచ్చును.

 

విజయవాడ వద్దే రాజధాని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చెపుతున్న కారణాలు, అదేవిధంగా అక్కడ రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షాల, రాయలసీమ ప్రజల, నిపుణుల కమిటీ అభ్యంతరాలు, సమస్యలు, అవరోధాల గురించి కూడా అందరికీ తెలుసు. కనుక ఇక వాటిపై చర్చ ఇప్పుడు అనవసరం. అయితే ఈ అంశంపై ఇంతకాలం ఈ అంశంపై మాట్లాడేందుకు వెనుకాడిన ప్రభుత్వం ఇప్పుడు తన నిర్ణయాన్ని ఇంత దైర్యంగా ప్రకటించాలనుకోవడానికి కారణమేమిటనే సందేహం ఎవరికయినా కలుగక మానదు. అందుకు చాలా బలమయిన కారణమే ఉంది. రాజధాని ఏర్పాటుకు ప్రధాన అవరోధంగా నిలుస్తున్న భూసమస్యకు రాష్ట్ర రెవెన్యూ శాఖ పరిష్కారం చూపింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం దైర్యంగా తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్దం అవుతోంది.

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి (వి.జి.టి.యం.) ప్రాంతాలలో అటవీశాఖకు చెందిన దాదాపు 45,000 ఎకరాల ప్రభుత్వభూమి ఉన్నట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. నున్న-నైనవరం-పాతపాడు ప్రాంతాలలో 13,488ఎకరాలు, ఇబ్రహీం పట్నం వద్ద 16,305 ఎకరాలు, కంచికర్ల సమీపంలో 10,500 ఎకరాలు, జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలలో 14,768ఎకరాల్ ప్రభుత్వ భూములు ఉన్నట్లు రెవెన్యూ శాఖ అధికారులు నిర్దారించారు. అయితే వాటిలో చాలా భాగం ఆక్రమణకు గురయిందని కూడా కనుగొన్నారు. ఆ భూములను కనుక తిరిగి స్వాధీనం చేసుకోగలిగినట్లయితే, భూములు కొనుగోలుకు ప్రభుత్వం ఇక డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. బహుశః ఈ కారణంగానే ప్రభుత్వం వి.జి.టి.యం. ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటుకు సిద్దమవుతోందని భావించవచ్చును. కానీ ఇది కొత్త ప్రశ్నలకు తావిస్తోంది.

 

రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఆక్రమణలకు గురయిన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం లేదా సంబంధిత శాఖలు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఇన్ని వేల ఎకరాలను ఇప్పటికిప్పుడు ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడం సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తే రాజధాని నిర్మాణం పనులు మొదలుపెట్టడం సాధ్యమేనా? రాజధానికి ముహూర్తం పెట్టేసుకొని ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తే ప్రజలు, ప్రతిపక్షాలు ఆక్షేపించారా? అనే ప్రశ్నలకు కూడా ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఏమయినప్పటికీ .జి.టి.యం. ప్రాంతంలో ఏకంగా 45,000 ఎకరాల ప్రభుత్వభూమి ఉండటం నిజమయితే అంతకంటే మంచి వార్త మరొకటి ఉండదని చెప్పవచ్చును.