వీళ్ల యాక్టింగ్ కు ఆస్కార్ ఇవ్వొచ్చు...


ఏపీ ప్రత్యేక హోదా విషయంలో పెద్ద డ్రామానే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ డ్రామాలో ఎవరి పాత్రల్లో వాళ్లు మాత్రం నటించడం కంటే.. జీవిస్తున్నారు అని చెప్పొచ్చు. అలా ఉంది ఒక్కొక్కరి ఫెర్మార్మెన్స్. ఎవరెవరి పెర్ఫర్మెన్స్ ఎలా ఉందో చూద్దాం.. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వడయ్యా బాబు అంటూ నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా... నిమ్మకు నిరెత్తన్నట్టు వ్యవహరిస్తుంది కేంద్రం. అంతేకాదు పాడిందే పాటరా... అన్నసామెత ప్రకారం.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు... అన్ని రాష్ట్రాల్లాగే ఏపీ కూడా.. సెంటి మెంట్ తో ఏం చేయలేం అని తెగేసి చెబుతుంది. మళ్లీ ఏపీకి అండగా ఉంటాం అని కబుర్లు చెబుతుంది. సరే బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పింది..మరి టీడీపీ ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంటుందా అంటే ఆ విషయంలో కూడా క్లారిటీ ఇవ్వరు. ఇదిగో విడిపోతారు... అదిగో విడిపోతారు.. ఇక విడిపోవడం ఒక్కటే మిగిలింది అన్న వార్తలు వస్తాయి తప్పా...ప్రత్యేక హోదా ఇవ్వనందుకు టీడీపీ గట్టిగి మీతో విడిపోతున్నాం అని చెప్పనూ లేదు. ఇక ఇప్పుడు రాజీనామాల డ్రామా తెరపైకి తెచ్చారు. నిజానికి చంద్రబాబుకే ఏపీకి ఏం కావాలో తేల్చుకోలేని కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నారు. మొదట స్పెషల్ స్టేటస్ అన్నారు.. తరువాత కేంద్రం ఏం మాయ మాటలు చెప్పిందో ఏమో కానీ స్పెషల్ ప్యాకేజీకి మొగ్గు చూపారు. పోనీ అదీ సరిగ్గా ఇచ్చారా అంటే అదీ లేదు. ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు చంద్రబాబు. అప్పుడు అసలు ప్యాకేజీకి ఒప్పుకోకపోతే ఇప్పుడు ఈ సమస్యే ఉండేది కాదు. కేంద్రానికి ఇప్పుడు అదే లూప్ హోల్ దొరికింది. అప్పుడు చంద్రబాబుకి చెప్పాము మేము ఆయన ఒప్పుకున్నారు అని. ఇప్పుడేమో ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నారు.. రాజీనామాలు, పోరాటాలు, అసెంబ్లీలో ఆందోళనలు అంటూ హడావుడి చేస్తున్నారు.

 

ఇక జగన్ మోహన్ రెడ్డిగారి తీరు చెప్పనక్కర్లేదు. ఎంతసేపు చంద్రబాబు పై విమర్శలు గుప్పించడమే జగన్ గారి టార్గెట్. కానీ ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన కేంద్రంపై.. మోడీ పై ఒక్క మాట కూడా మాట్లాడరు. విమర్శించరు. ఎందుకంటే టీడీపీ విడిపోతే వెంటనే బీజేపీ తో దోస్తీ కట్టాలని చూస్తున్నారు కదా. ప్రత్యేక హోదా కోసం మేం రాజీనామాలు చేస్తాం.. మీరు రాజీనామాలు చేస్తారా అంటూ.. అవిశ్వాస తీర్మానం పెడతామని అన్నీ లెక్కలు, కాలిక్యూలేషన్స్ వేసుకొని తను సేఫ్టీ జోన్ లో ఉండేలా ప్లాన్లు వేస్తారు. మరోసారి మోడీ పై విశ్వాసం ఉంది ప్రత్యేక హోదా ఇస్తారని అంటాడు. అంత నమ్మకం ఉంటే... ఒక్కసారి వెళ్లి జగన్ మాట్లాడితే ఇన్నీ సమస్యలు ఉండవు కదా..

 

ఇవన్నీ ఒకటైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి రూటు సేపరేటు. ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన అప్పుడప్పుడు కొన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు కానీ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి మాత్రం ఎందుకో రాలేకపోతున్నారు ఆయన ఇంకా. ఇక ప్రత్యేక హోదా విషయంలో ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం అబద్దం చెబుతుందా..కేంద్రం అబద్దం చెబుతుందా అని తెలుసుకోవడానికి పెద్ద పెద్ద తలకాయలతో కలిసి ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇక వారు అన్ని లెక్కలు చూసి.. ఓ నివేదిక తయారు చేసి అందులో కేంద్రం ఏపీకి ఇచ్చింది ఏం లేదని తెలిపింది. వాళ్లు అంత కష్టపడి నిజాన్ని చెప్పినా పట్టించుకునే గతి లేదు. ఇక రెండు రోజులు హడావుడి చేశారు.. ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మళ్లీ గుర్తొచ్చినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తారు.

 

ఇక కాంగ్రెస్ ది ఒక గోల.. రాష్ట్రాన్ని విడగొట్టి చేసుకున్న పాపానికి ఇప్పటికీ ఫలితం అనుభవిస్తుంది.. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతిస్తున్నాం.. అని మేం అధికారంలోకి వస్తే మొదట చేసే పని ప్రత్యేక హోదా ఇవ్వడమేనని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. మొత్తానికి అటు కేంద్ర నాయకులు... ఇటు రాష్ట్ర నాయకులు అందరూ కలిసి జనాల్ని పిచ్చేళ్లని చేస్తున్నారన్న విషయం మాత్రం అర్ధమైపోయింది. వాళ్లకి కావల్సినప్పుడు, అన్నీ చూసుకొని, రాజకీయ ప్రయోజనాలను లెక్కేసుకొనే ఏ స్టెప్ అయినా తీసుకుంటారు. అప్పటి వరకూ వీళ్ల ఆస్కార్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ లు చూడాల్సిందే.