సమరానికి సిద్ధం...!

లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లక్ష్యంగా.... దేశంలో పేరుకుపోయిన ఇతర సమస్యలనూ ప్రస్తావించేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేంద్రం అనూహ్యంగా అంగీకారం తెలిపింది. ఎవరూ ఊహించని ఈ పరిణామానికి బీజేపీ వ్యూహాతక్మంగా తెర తీసింది. తొలుత పది రోజుల్లో అవిశ్వాసంపై నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ కేవలం 24 గంటలలోపే శుక్రవారం నాడు చర్చకు అనుమతించడం ప్రజాస్వామ్యానికి శుభసూచకం. భవిష్యత్‌లో ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదురైతే నేటి అంశాన్ని విపక్షాలు పాలకపక్షం ముందు చూపించి న్యాయం చేయమని కోరే అవకాశం ఉంది.  విపక్షాల గొంతు నొక్కేందుకు అధికార పక్షం చేసే యత్నాలకు ఇలాంటి సంఘటనలు అడ్డుకట్ట వేస్తాయి.

 

 

సరే, యుద్ధం ప్రారంభమైంది. సమర సమయం కూడా నిర్ణయం అయిపోయింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై లోక్‌సభ వేదికగా చర్చ ప్రారంభమవుతుంది. మొత్తం ఏడు గంటల పాటు ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వివిధ పార్టీలు సభలో చర్చిస్తాయి. లోక్‌సభలో పార్టీల బలాబలాలను బట్టీ ఆయా పార్టీలు మాట్లాడే సమయాన్ని కూడా కేటాయించారు. సభ నియమాల ప్రకారం ఇది పద్దతే అయినా.... సమస్య పరంగా చూస్తే మాత్రం ఈ సమయ పాలన ఆంధ్రప్రదే‌శ్‌కు రుచించదు. ప్రత్యేక హోదాపై అట్టుడికిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను లోక్‌సభలో వెల్లడించేందుకు రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీకి దక్కిన సమయం కేవలం 13 నిమిషాలు.

ఈ కాస్త సమయంలోనే మొత్తం ఆవేదనంతా సభలో చెప్పుకోవాలి. అయితే ఇదే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన సమయం 38 నిమిషాలు. విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరమైన కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆ ప్రజలకు చేరువయ్యేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని చూడడం మంచి పరిణామం. ఇక మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ లోక్‌సభ సభ్యులకు ఇచ్చిన సమయం 9 నిమిషాలు. ఈ సమయంలో వారు ప్రత్యేక హోదా కంటే కూడా తమ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపైనే ప్రస్తావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిప‌క్ష వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు రాజీనామా చేయ‌డంతో వారు స‌భ‌కు వ‌చ్చే అవ‌కాశం లేదు. 

 

 

ఈ ఏడు గంటల చర్చ అనంతరం అధికార పక్షానికి సమాధానం ఇచ్చుకునే సమయం చర్చకు కేటాయించిన సమయంలో సగం కంటే ఎక్కువే. అంటే ప్రతిపక్షాలు గంట సేపు సమస్యపై ప్రస్తావిస్తే అధికార పార్టీ మాత్రం దానికి మూడు గంటలకు పైగా సమాధానం ఇస్తుంది. దీనినే వడ్డించే వారు మనవారైతే అంటారు. అవిశ్వాసంపై విజయం అధికార పక్షానిదే అని తేలిపోయింది. సభలో వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అధికార పక్షానికి మిత్రపక్షాలైన తెలంగాణ రాష్ట్ర సమితి, అన్నాడిఎంకే, బిజేడీ వంటివి అవిశ్వాపానికి వ్యతిరేకంగా మాట్లాడతాయి.

 

 

ఇందులో అన్నాడిఎంకే అయితే తమ సభ్యులు విధిగా సభకు హాజరుకావాలనే విప్‌ను కూడా జారీ చేయలేదు. పైగా ఇది ఆంధ్రప్రదేశ్ సమస్య. దీంతో మాకేంటి అని ఆ పార్టీ ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. ఇంచుమించు ఇదే ప్రకటనను తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చేసింది. దీంతో ఈ రెండు పార్టీలూ అధికార పక్షం వైపు చేరిపోయినట్లే. ఇక ఒడిషాలోని బిజేడీ అయితే తాము ఓటింగుకు దూరం అని ప్రకటించింది. శివసేనతో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నెరపిన దౌత్యం ఫలించినట్లు కనిపించడం లేదు. ముందు సరే అన్నా... అర్ధరాత్రి శివసేన పులి ప్లేటు మార్చింది. 

 

 

ఓటింగ్‌పై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇక అవిశ్వాసానికి మద్దతుగా తీర్మానం పెట్టిన తెలుగుదేశం, దానికి సహకరిస్తున్న కాంగ్రెస్ ఓటు వేస్తాయి. వీరికి మద్దతుగా వామపక్షాలు, మమతా బెనర్జీ, అమ్ ఆద్మీ వంటి పార్టీలు బాసగా నిలుస్తాయి. అయితే వీరి సంఖ్యాబలం తక్కువ కాబట్టి తీర్మానం వీగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ ముందుగా చర్చను ప్రారంభిస్తుంది. ఇందులో కూడా ఆ పార్టీ కాస్త ఇబ్బంది పడింది. ముందుగా తీర్మానం ప్రవేశపెట్టిన కేశినేని నాని మాట్లాడతారని ప్రకటించారు. అనూహ్యంగా ఆయన స్ధానంలో గల్లా జయదేవ్ వచ్చారు.

దీంతో నాని అనుచరుల్లో కోపం, అసహనం ప్రారంభమైంది. కేశినేని నాని కూడా పైకి తమ నాయకుడు చెప్పినట్లే చేస్తామని ప్రకటించినా లోలోపల ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఇక సభకు  రానని భీష్మించుకున్న అనంతపురం ఎంపీ జె.సీ.దివాకర్ రెడ్డి అలక వీడారు. ఆయన అనుకున్నది సాధించుకుని శుక్రవారం సభకు హాజరవుతానని ప్రకటించారు. అంతే కాదు... కేంద్రం వైఖరికి నిరసనగా ఆయన రాజీనామా కూడా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై నేడు తేలనుంది. ఈ అంశపై చర్చ అనంతరం ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆదరిస్తారో... ఎవరిని తిరస్కరిస్తారో  తేలిపోతుంది.