మీరు చెప్పినట్టు నడవాలా అంటూ బాబు మీద స్పీకర్ ఫైర్ !

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఐదో రోజున ప్రారంభమైన సమావేశాల్లో సీట్ల కేటాయింపుపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు జరిగాయి. శాసన సభలో ఉపనేతలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రూల్స్ ప్రకారం అచ్చెన్నాయుడుకు ప్రత్యేక సీటు కేటాయించాలని కోరారు. దీంతో ఆగ్రహావేశాలకి లోనయిన స్పీకర్ తమ్మినేని టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. 

మీరు చెప్పినట్లు ఇక్కడ సభ నడవాలా ? చంద్రబాబు గారూ బెదిరించొద్దు అంటూ తమ్మినేని ప్రతిపక్ష నేతపై సీరియస్ అయ్యారు.  "చంద్రబాబునాయుడు గారూ... మీరు చెప్పినట్టుగా హౌస్ రన్ చేయాలా ? బెదిరించవద్దు. డోంట్ డిక్టేట్ చైర్. మీరు ఫోర్స్ చేయకండి. డోంట్ ఓన్ ది పోడియం...మీరు బెదిరించకండి. నో... ప్లీజ్" అంటూ సభను ఆర్డర్ లో పెట్టేందుకు ప్రయత్నించారు. అంతకుముందు గోరంట్ల బుచ్చయ్యచౌదరి వచ్చి చంద్రబాబు పక్కన కూర్చోవడం, అక్కడే లేచి నిలబడి నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించడంతో గొడవ ప్రారంభమైంది.

ఆ సీటు టీడీపీ ఉప నేత అచ్చెన్నాయుడికి కేటాయించిన నేపథ్యంలో గోరంట్లను తన స్థానంలోకి వెళ్లాలని సూచించడంతో వాదోపవాదాలు పెరిగాయి. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ఎవరికి ఏ స్థానం కేటాయించాలో, అది స్పీకర్ నిర్ణయమని, దానిలో మార్పులు ఉండవని అన్నారు. ఇంతలో స్పీకర్ చంద్రబాబు మీద గట్టిగా మాట్లాడంతో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వుయ్ వాంట్ జస్టీస్ అంటూ నినాదాలు చేశారు.