ఏపీ ఎస్ఈసీ సెకండ్ వికెట్ ! సెక్రటరీ వాణిమోహన్ అవుట్  

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, ఏపీ ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదంలో మరో కీలక పరిణామాం చోటు చేసుకుంది. తన అధికారాలకు మరింత పదును పెడుతున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్..దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై వరుసగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల సంఘం సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్‌ను తొలగిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్‌కు ఆయన లేఖ రాశారు. వాణిమోహన్‌ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని లేఖలో తెలిపారు. వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ,

రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍పై సోమవారం క్రమశిక్షణ చర్యలు చర్యలు తీసుకున్నారు ఎస్ఈసీ నిమ్మగడ్డ . 30 రోజులపాటు సెలవుపై వెళ్లారు సాయిప్రసాద్‌. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన ఎన్నికల కమిషన్.. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయంటూ సాయి ప్రసాద్‌ను విధుల నుంచి తొలగించింది. ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా లేదా.. పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.  ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయాలతో సర్కార్ మద్దతుగా ఉంటున్న ఉద్యోగుల్లో ఆందోళన కనిపిస్తోందని చెబుతున్నారు.