మూడు రోజుల్లోనే వందల కేసులు! కరోనా హాట్ స్పాట్లుగా స్కూళ్లు?

జగన్ సర్కార్ మెండి వైఖరి ఏపీని మళ్లీ ప్రమాదంలోకి నెడుతుందా? రాష్ట్రంలో కరోనా మళ్లీ పంజా విసరనుందా? అంటే అవుననే అనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంగా స్కూళ్లను తెరవడంతో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. బడులు తెరిచిన మూడు రోజుల్లోనే దాదాపు 3 వందల వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇంకా కొన్ని ఫలితాలు రావాల్సి ఉంది. అన్ని జిల్లాల్లోనూ స్కూళ్లకు వస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు వైరస్ భారీన పడుతున్నారని తెలుస్తోంది. అన్ లైన్ క్లాసుల నిర్వహణ సమయంలోనూ చాలా మంది టీచర్లు, సందేహాల నివృత్తి కోసం స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు కరోనా సోకింది. వారి ద్వారా కుటుంబ సభ్యులకు వైరస్ అంటుకుంటోంది. ఇప్పుడు స్కూళ్లు తెరవడంతో వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఏపీ ప్రజల్లోఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులు, టీచర్ల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం ఆటలాడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. 

 

ఏపీలో బడి తలుపులు తెరిచి మూడు రోజులైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూళ్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా.. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 239 మంది ఉపాధ్యాయులు, 44 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్టు గుర్తించారు. మరిన్ని పరీక్షల ఫలితాలు అందాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో ఏకంగా 25 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకినట్టు గుర్తించారు. వారిలో వైరస్‌ లక్షణాలు పెద్దగా లేకపోయినప్పటికీ స్ర్కీనింగ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 10 రోజుల్లో 172 మంది ఉపాధ్యాయులకు, 262మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరంతా తొమ్మిది,  పదో తరగతి విద్యార్థులే. ఆన్‌లైన్ పాఠాల్లో సందేహాల నివృత్తి కోసం స్కూళ్ళకు వెళ్ళిన సమయంలో విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. 

 

ప్రకాశం జిల్లాలోని స్కూళ్లల్లో కరోనా కలకలం కొనసాగుతోంది. తాజాగా ఏడుగురు విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులతో పాటు, ఓ హెచ్ఎంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  విశాఖ జిల్లా విద్యా శాఖలో కరోనా కలకలం రేపుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 52 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిలో 46 మంది ఉపాధ్యాయులు, నలుగురు సిబ్బంది, ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది 500 మంది ఉపాధ్యాయులకు ఇటీవల కరోనా స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించగా 5 శాతం మంది కొవిడ్‌ బారిన పడినట్లు వెల్లడైంది.

 

కర్నూలు జిల్లాలో పాఠశాలలు తెరుచుకున్న మూడు రోజులకే ముగ్గురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు. అక్టోబరు నుంచి ఇప్పటివరకు జిల్లాలో 38 మంది టీచర్లు, 125 మంది విద్యార్థులకు కరోనా సోకింది. చిత్తూరు జిల్లాలో  ఇప్పటికే ఏకంగా 187 మంది ఉపాధ్యాయులకు, 13 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్లు తేలింది. 
                   

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. చాలా దేశాల్లో  వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. అమెరికాలో రోజూ లక్ష కొత్త కేసులు వస్తున్నాయి. యూరప్ లోనూ సేకండ్ వేవ్ భయంకరంగా విస్తరిస్తోంది. లండన్, పారిస్ సహా పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు. వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. మనదేశంలోనూ కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో సేకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ధర్డ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలని ప్రజలను అలర్ట్ చేశారు సీఎం కేజ్రీవాల్. వింటర్ సీజన్ లో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశముందని, మూడు నెలల వరకు జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ సహా దేశంలోని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. 
 

కరోనా సేకండ్ వేవ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతుండగా.. మన దేశంలోని ఢిల్లీ, కేరళలో ఇప్పటికే కనిపిస్తుండగా ఏపీ సర్కార్ మాత్రం మెండిగా వ్యవహరిస్తోంది. తాము అనుకున్నది జరగాలన్నట్లుగా స్కూళ్లను నడిపిస్తోంది. దీంతో ఏపీలో తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఏపీలో గతంలో రోజుకు 10 వేలకు పైగా కేసులు రాగా.. ప్రస్తుతం మూడు వేలకు లోపుగానే వస్తున్నాయి. ఈ సమయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన జగన్ సర్కార్.. పట్టుదలకు పోతూ ప్రజల ప్రాణాలకు గండం తెస్తుందనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. స్కూళ్లను కొనసాగిస్తే ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశాలున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
 

స్కూళ్లు తెరిచినా మూడు రోజుల్లోనే టీచర్లు, విద్యార్థుల్లో దాదాపు 3 వందల మందికి కరోనా పాజిటివ్ రావడం భవిష్యత్ అనర్ధాలకు సంకేతమిస్తోంది. దీంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి పేరెంట్స్ ఇష్టపడటం లేదు. దీంతో మొదటి రోజు దాదాపు 20 శాతం మంది విద్యార్థులు స్కూళ్లకు రాగా.. మూడో రోజుకి అది ఐదు శాతానికి పడిపోయిందంటున్నారు. ఇక విద్యాశాఖలోనూ కరోనా కలవరం రేపుతోంది. కేసులు పెరిగితే స్కూళ్ళకు సెలవులు ప్రకటించాలని జిల్లాల డీఈవోలు భావిస్తున్నారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో స్కూళ్లు నడిపించినా పిల్లలు రారని, ప్రభుత్వమే ఆలోచించి స్కూళ్లను నిలిపివేయాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి.