అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి. 

అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.