ఏపీ విషయంలో ఇంత నాన్చుడు అవసరమా..!


రాజకీయ నాయకులు అధికారంలోకి రాకముందు ఒకలా మాట్లాడతారు...అధికారంలోకి వచ్చిన తరువాత ఒకలా మాట్లాడతారు. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అలానే ఉంది కేంద్ర ప్రభుత్వ వ్యవహారంచూస్తుంటే. ఎందుకంటే రాష్ట్రం విడిపోయే ముందు ఐదు కాదు పదిసంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. కానీ ఆతరువాత ఆ చట్టం.. ఇ చట్టం అని చెబుతూ... ప్రత్యేక హోదా ఇవ్వడానికి నానా సాకులు చెబుతున్నారు. పోనీ రెవిన్యూ లోటును అయినా భర్తీ చేస్తున్నారా అంటే.. అదీ లేదు. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆ రాష్ట్రం మొదటి సంవత్సరం రెవిన్యూ లోటును పూర్తిగా కేంద్రమే భర్తీ చెయ్యాలి. ఏదో కష్టపడి తమ ఆర్ధిక లోటు 13,775 కోట్లు అని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చూపించింది. ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం... ఈ విషయంలో కూడా వంకలు చూపించి.. 13,775 కోట్లు కాస్తా...  దానిని కేవలం 4117.89 కోట్లు అని తేల్చింది. ఇక ఈ నిధులు ఇవ్వడానికి కూడా కేంద్రానికి చేతులు రావడం లేదు. 4117.89 కోట్లలో ముందు  2303 కోట్లు రాష్ట్రానికి ఇచ్చింది. ఇంకా 1814.89 కోట్లు ఇవ్వాలి. అందులో రాష్ట్ర అధికారులు కాళ్ళు అరిగేలా తిరిగితే కాని  369 కోట్లు మంజూరు చేసింది. మిగతా 1445.89 కోట్లు ఎప్పుడు విదిలిస్తారో ఎవరికీ తెలియని మిస్టరీ. ఏదో చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో.. రెవిన్యూ లోటుతో నానా కష్టాలు పడుతున్నా.. ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు.