ఎక్కువ మాట్లాడితే పార్టీలో కూడా ఉండం..!

 

ఉమ్మడిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా చీల్చి.. ఆ పాప భారాన్ని నెత్తిమీద వేసుకొని ఇప్పటికీ సోనియా గాంధీ మోస్తూనే ఉన్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడప్పుడే పుంజుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ప్రత్యేక రాష్ట్ర ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు ఏమైనా కాసిన్ని ఓట్లు రాల్చొచ్చేమో కానీ.. ఏపీలో అయితే సమస్యేలేదు. కాంగ్రెస్ ను నమ్మే ప్రసక్తే లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న పార్టీని ఎన్నికల్లో గెలిపించాలంటే కాస్త కష్టమైన పనే. కష్టపడినా ఫలితాలు దక్కకపోవచ్చు. అసలు ఏపీ ప్రతిపక్ష నేత అయిన జగన్ కు కాంగ్రెస్ తో పోలిస్తే కాస్త జనాదారణ ఉందనే చెప్పొచ్చు. అలాంటి జగన్ నే ప్రజలు పక్కనబెడుతుంటే.. ఇంకా కాంగ్రెస్ ను ఎవరు పట్టించుకుంటారు. అందుకే పార్టీ నేతలు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.  నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం ఎదుర్కోవడంపై కాంగ్రెస్ నేతల మధ్య వాడివేడి చర్చ జరిగిందట. ఈ సందర్భంగా... ఈ రెండు ఎన్నికల్లో ఓడిపోయినందుకు గాను.. సోనియాగాంధీ సీరియస్ గా ఉన్నారంటూ నేతల వద్ద దిగ్విజయ్ అన్నారట. దీంతో అసలే పార్టీలో ఎదుగుదల లేకుండా ఉన్నందుకు కాస్త అసంతృప్తితో ఉన్న నేతలు... దిగ్విజయ్ ఈ విషయం చెప్పడంతో.. ఏపీలో పార్టీ కొంతవరకైనా బలపడకపోతే, పార్టీలో ఒక్క నాయకుడు కూడా మిగిలే పరిస్థితి లేదని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ అంతర్గత విషయాలపై చర్చించేందుకు ఓసారి ముఖ్య నేతలంతా ఢిల్లీకి రావాలని దిగ్విజయ్ సూచించడంతో...కొంతమంది అక్కడికి వెళ్లారు. మరి ఏపీ ప్రజలే కాంగ్రెస్ ను నమ్మే పరిస్ధితిలో లేనప్పుడు... పార్టీ నేతలు మాత్రం ఏం చేస్తారు పాపం...