రెచ్చిపోకండి...మీకూ అవసరం వస్తుంది...!


ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ టీడీపీ, వైసీపీ పార్టీలు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టారు కానీ... ఇంతవరకూ చర్చకు రాలేదు. అవిశ్వాస తీర్మానానికి కావాల్సినంత మద్దతు ఉన్నా చర్చకు మాత్రం రావట్లేదు. దీనికి కారణం... టీఆర్ఎస్, అన్నాడీఎంకేల వైఖరే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకపక్క ఏపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే... మరోపక్క టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ల పెంపు కోసం...అన్నాడీఎంకే కావేరి నది జల వివాదంపై పోరాడుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలను బీజేపీ పార్టీనే నడిపిస్తుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే అవిశ్వాస తీర్మానంపై చర్చకు రానివ్వకుండా అడ్డుకుంటున్నాయి అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆపార్టీల నేతల వ్యాఖ్యలు చూస్తుంటే నిజమేనేమో అని కూడా అనిపిస్తుంది.

 

ఎందుకంటే ఇదే విషయంపై ఓ టీఆర్ఎస్ ఎంపీని అడుగగా.. దానికి ఆయన మమ్మల్ని అడిగి అవిశ్వాస తీర్మానం పెట్టారా.. మేమెందుకు మద్దతు ఇవ్వాలని.. అయినా పక్కరాష్ట్రాలతో మాకు పనిలేదు అని మద్దతివ్వం అని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు. ఇప్పుడు అన్నాడీఎంకే కూడా తమ వైఖరి ఏంటో చెప్పేసింది. అన్నాడీఎంకే అధికారిక పత్రికలో బీజేపీతో తమకున్న బంధాన్ని బయటపెట్టేసింది. ఏపీ ప్రయోజనాల కోసం తాము సహకరించాల్సిన అవసరం లేదని, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తమకు లేదని కుండ బద్దలు గొట్టింది. తాము లోక్‌సభలో పోరాడుతున్నది తమ రాష్ట్ర ప్రయోజనాలకే తప్ప ఏ పార్టీకీ వ్యతిరేకంగా కాదని.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీ మోదీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తామెందుకు మద్దతివ్వాలని సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు.. ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే అది తమకు హానిగా మారుతుందని, జయలలిత కూడా ఇదే చెప్పేవారని చెప్పారు. మొత్తానికి  అన్నాడీఎంకేను అడ్డుపెట్టుకుని బీజేపీ నాటకాలు ఆడుతోందన్న విషయం దీనిబట్టి అర్ధమైపోయింది. మరి పక్క రాష్ట్రాలతో మాకు అవసరం లేదు... మాకు వారితో పనిలేదు అని విర్రవీగుతున్న ఈ పార్టీలు.. అన్ని రోజులు ఒకలాగే ఉండవు.. ఎప్పుడూ తామే అధికారంలో ఉండమన్న సంగతి గుర్తుంచుకుంటే బెటర్. లేకపోతే భవిష్యత్తులో తమకు కూడా ఇలాంటి పరిస్థితులు రావచ్చు... ఇప్పుడు బీజేపీని చూసి రెచ్చిపోతున్న వీళ్లు.. తేడా వస్తే అదే పార్టీ మాకు మీ అవసరం లేదు పోండి అనే రోజులు కూడా రాకమానదు... అప్పుడు అవసరం లేదన్న ఈ పక్క రాష్ట్రాల అవసరమే గతవుతుంది...