రాజకీయ నేతల విషయంలో ఏపీఎన్జీవోలు వైఖరి మార్చుకొన్నారా

 

ఏపీఎన్జీవోలు తమపై క్రమంగా రాజకీయ నేతల దాడి తీవ్రతరం అవుతుండటంతో కొంచెం వెనక్కి తగ్గినట్లున్నారు. రేపు విజయవాడలో భారీ ఎత్తున జరుగబోయే సమైక్యాంధ్ర సభకు రాజకీయ నేతలను తాము ఆహ్వానించకపోయినప్పటికీ, ఎవరయినా వస్తే వారిని కాదనకుండా సముచిత గౌరవం ఇస్తామని ఏపీఎన్జీవో నేతలు ప్రకటించారు.

 

కానీ, ఇది ఇరువురికీ ఇబ్బందులు సృష్టించడం తప్ప వేరే ఉపయోగం ఉండదు గనుక బహుశః రాజకీయ నేతలు కూడా ఈ సభకు దూరంగా ఉండవచ్చును. ఒకవేళ ఎవరయినా దైర్యంచేసి ప్రజలు, ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొనే ఈ సభకు వచ్చినా, వారి నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొని అవమానకరంగా నిష్క్రమించాల్సి ఉంటుంది గనుక, నేతలు దూరంగానే ఉండవచ్చును.

 

అయితే ఏపీఎన్జీవోల సమ్మె పతాక స్థాయికి చేరుకొన్నఈ తరుణంలో వారికి బలమయిన ఒక రాజకీయ పార్టీ అండ ఉంటే చాలా మేలు చేయవచ్చును. కానీ, మూడు ప్రధాన పార్టీలలో వారు దేనిని ఎంచుకొన్నా ఊహించని కొత్త సమస్యలు ఏర్పడి, వారి మధ్య చీలికలు సృష్టించే ప్రమాదం ఉంది. అందువల్ల వారు అన్ని రాజకీయ పార్టీలను సమదూరంలో ఉంచవలసివస్తోంది. లేకుంటే సమైక్యాంధ్ర ఉద్యమం నేడు మరో విధంగా ఉండేది.ఏమయినప్పటికీ, ఏ రాజకీయ పార్టీ మద్దతు తీసుకోకుండా ఇన్ని రోజులు దాదాపు ఆరు లక్షల మంది ఉద్యోగులు, తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను సైతం లెక్క జేయకుండా ఏక త్రాటిపై నడుస్తూ ముందుకు సాగడం నిజంగా అద్భుతమేనని చెప్పక తప్పదు.