ఏపీలో కొత్త వివాదం... బయోమెట్రిక్‌పై ఉద్యోగుల గరంగరం

 

ఇష్టమొచ్చినప్పుడు వస్తారు... బోర్‌ కొట్టినప్పుడు వెళ్లిపోతారు. అసలు ఎప్పుడు ఆఫీస్‌లో ఉంటారో... ఎప్పుడు వెళ్లిపోతారో తెలియదు. అసలు వాళ్లను అడిగే వాళ్లే ఉండరు. మధ్యాహ్నం అయినా… డ్యూటీకి రావాలన్న సంగతి మర్చిపోతారు. ఇలా టైమ్‌కు డ్యూటీకి రాని ఉద్యోగులపై ఏపీ సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ఎంప్లాయిస్ టైమింగ్స్‌పై ఆరోపణలు రావడంతో సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం...  టైమ్‌ టూ టైమ్‌ పనిచేసేలా స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఉదయం 11 గంటలు దాటినా… ఉద్యోగులు డ్యూటీకి రాకపోవడంతో  ప్రభుత్వ సేవలు పొందడంలో ప్రజలు ఇబ్బందిపడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం... ఉద్యోగుల అటెండెన్స్‌ ఇష్యూను సీరియస్ గా తీసుకుంది. ఇలాంటి వారి కోసం నయా ప్లాన్ రెడీ  చేసింది సర్కారు.

 

ఇష్టమొచ్చినట్లు వ్యవహరించే ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని... బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకొచ్చింది. వైద్యారోగ్య, రెవెన్యూ శాఖలతో పాటు సచివాలయంలోనూ బయోమెట్రిక్ సిస్టమ్ అమల్లోకి తెచ్చింది. సచివాలయం ఉద్యోగులకు వారానికి ఐదురోజులే పని దినాలున్నా సోమవారం, శుక్రవారం సాయంత్రం త్వరగా వెళ్లడంతో పాటు  ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో బయో మెట్రిక్‌ను తప్పని సరి చేసింది ప్రభుత్వం.

 

ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీసుకు వచ్చి పోదాం... అనుకునే ఉద్యోగులకు ఈ కొత్త సిస్టం చెక్ పెట్టనుంది. ఇది పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తేనే ఉద్యోగుల తీరులో మార్పు వస్తుందని  సర్కారు  భావిస్తుంది. అయితే బయోమెట్రిక్‌ సిస్టమ్‌ను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఇది తమను వేధించడానికే అంటున్నారు. ఈ-ఆఫీస్‌‌తో ఎవరు ఎక్కడ నుంచైనా పని చేసుకునే వెసులుబాటు ఉందని, కొత్తగా బయోమెట్రిక్‌ సిస్టమ్‌ను అమలు చేయడం సరికాదంటున్నారు.