ఏపీ మంత్రులు డమ్మీలుగా మారారా? వెలగపూడిలో వినిపిస్తోన్న గుసగుసలేంటి?

 

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు డమ్మీలుగా మారారనే మాట వినిపిస్తోంది. మంత్రులు తమ పరిస్థితిని తలుచుకుని తమలో తామే రగిలిపోతున్నారట. తాము చెప్పింది విననప్పుడు, తమ మాట నెగ్గనప్పుడు ఎందుకీ మంత్రి పదవులు అంటూ మదనపడుతున్నారట. తమ పరిస్థితిని ముఖ్యమంత్రికి చెప్పుకోలేక... మరోవైపు ఏం చేయాలో తోచక తమలో తామే తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారట. తమతమ శాఖల పరిధిలోనే తమ మాట చెల్లుబాటు కావడం లేదని, ముఖ్యంగా ఐఏఎస్ లు, ఐపీఎస్ లు... మాట వినడం లేదని రగిలిపోతున్నారట. ఎందుకంటే, ఆయా శాఖాధిపతులను, ముఖ్యమైన అధికారులను... స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ఎంపిక చేసుకుని, నియమించడంతో, ఆయా అధికారులు... మంత్రుల మాటలను పెద్దగా లెక్క చేయడం లేదనే మాట వినిపిస్తోంది. 

సీఎం జగన్మోహన్ రెడ్డి... ప్రతి చిన్న విషయానికీ అధికారులపైనే ఆధారపడుతున్నారని, మంత్రుల మాటను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదనే గుసగుసలు సెక్రటేరియట్ లో వినిపిస్తున్నాయి. పరిపాలనలో జగన్ పూర్తిగా అధికారులపైనే ఆధారపడుతుండటంతో మంత్రులు ఇబ్బంది పడుతున్నారట. సీఎం ఇలా, అధికారులనే నమ్ముకోవడంతో, తమ శాఖల పరిధిలోని సెక్రటరీలు, కీలక అధికారులు తమను లెక్కచేయడం లేదని మంత్రులు వాపోతున్నారట. అంతేకాదు శాఖలపై పూర్తిగా తమదే అధికారమన్నట్టుగా కొందరు ఐఏఎస్‌లు వ్యవహరిస్తున్నారట. ఏదైనా పనికావాలంటే సతాయిస్తున్నారని, తమకు అన్ని విధాలా లాభముందంటేనే ఫైలు ముందుకు కదుపుతున్నారని మంత్రులు మండిపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ విషయాలన్నీ జగన్‌ దృష్టికి తీసుకెళ్దామనుకుంటే, తమపైనే చాడీలు చెప్పారేమోనని మంత్రులు భయపడుతున్నారట. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తోన్న ప్రాధాన్యతను ఉపయోగించుకొని కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ...అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అందుకు బదిలీలే నిదర్శమంటున్నారు.

కొందరు మంత్రులు ధైర్యంచేసి... ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల తీరును జగన్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా, సీఎం సన్నిహితులు మాత్రం వద్దని వారించారట. పాలనపై పట్టు కోసం అధికారులకు స్వేచ్ఛనిచ్చింది నిజమేనని, అయితే వాళ్ల పనితీరుపై జగన్ కన్నేసి పరిశీలిస్తున్నారని, అధికార యంత్రాంగంపై పట్టు దొరికాక అందర్నీ సెట్ రైట్ చేద్దామని, అప్పటివరకు కొంచెం ఓపిక పట్టాలని సీఎం సన్నిహితులు చెప్పినట్లు తెలిసింది. అయితే ఇంత సీనియర్లమై ఉండి, అధికారుల అరాచకాన్ని ఎలా భరించాలని మంత్రులు లబోదిబోమంటున్నారట. సీఎం ఇచ్చిన బలంతోనే, తమను లెక్క చేయడం లేదని మండిపోతున్నారట మినిస్టర్లు. ఇదిలా ఉంటే, మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దగా టైమ్ ఇవ్వడం లేదనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా కలెక్టర్లు, ఎస్పీలు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఆయా శాఖాధిపతులు, ఇతర ఉన్నతాధికారుల బదిలీల విషయంలో ఎవరీ మాట వినడం లేదని, తనకు నచ్చినవాళ్లను మాత్రమే నియమిస్తుండటంతో, మంత్రులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారట.