జగన్ సర్కార్ కు బిగ్ షాక్.. మూడు రాజధానులపై హైకోర్టు స్టే 

సీఎం జగన్‌కు ఏపీ హైకోర్టులో పెద్ద షాక్ తగిలింది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. రాజధాని వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు బిల్లు పై గవర్నర్ ఇచ్చిన గెజిట్‌పై కోర్టు మంగళవారం స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీని పై తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతధ స్థితిని కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.

ఏపీలో 3 రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్రవేయడాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టులో సోమవారం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ పై జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్ కోర్టును కోరారు. రాజ్ భవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు గవర్నర్ జారీ చేసిన గెజిట్‌పై స్టేటస్ కో విధించింది.