పావురాలగుట్టకు మహర్దశ!!

 

కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గరలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన పావురాల గుట్టలో రూ.25 కోట్లతో వైఎస్‌ఆర్ స్మృతివనాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారిక ప్రకటన చేశారు.

అప్పట్లో ఉభయ తెలుగు రాష్ట్రాల వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున పావురాల గుట్టకు వెళ్లి చూసి వచ్చేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ప్రతీ కార్యక్రమానికి ముందు పావురాల గుట్టకు వెళ్లేవారు. అక్కడ తండ్రి వైఎస్ కు ప్రార్థన చేసి ఆ తర్వాత ఇడుపుల పాయకు వెళ్లేవారు. అక్కడ వైఎస్ సమాధికి నివాళులర్పించేవారు. మొదట కొన్నాళ్లు అలా కొనసాగినా రాను రాను పావురాగల గుట్టను పక్కన పెట్టేశారు.

వైఎస్ చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి అయిన రోశయ్య పావురాల గుట్టను ఓ పర్యాటక ప్రదేశంగా, ఓ స్మృతి వనంగా మారుస్తామని ప్రకటించారు. అయితే ఆయన అలా చేయక ముందే పదవి నుంచి దిగిపోయారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా పావురాల గుట్ట స్మృతి వనం గురించి ఆలోచించినా జగన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆ తర్వాత పట్టించుకోలేదు. దాంతో పావురాల గుట్ట కేవలం వైఎస్ మరణం గురించి చెప్పుకునేటప్పుడు మాత్రమే వార్తల్లోకి వస్తోంది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ పావురాల గుట్ట విషయాన్ని బయటకు తీశారు. గుట్టను స్మృతి వనంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీని కోసం రూ. 25 కోట్లు కేటాయిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అంటే పావురాల గుట్టకు మళ్లీ మహర్దశ వచ్చినట్లే!