ప్రమాదకరంగా మారిన గన్నవరం చుట్టుపక్కల సెల్ టవర్లు...

 

ఏపీ సీఎం జగన్ హెలికాప్టర్ ప్రయాణాలపై అధికారులు, పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్ పోర్టు చుట్టు పక్కల ప్రాంతాల్లో కొన్ని మార్పులకు సిద్ధమయ్యారు. ఎయిర్ పోర్టు చుట్టుపక్కలున్న సెల్ టవర్ ల వల్ల భద్రతాపరమైన ఇబ్బందులను గుర్తించిన సిబ్బంది, ఎయిర్ పోర్ట్ అథారిటీ దృష్టికి తీసుకువచ్చారు. గన్నవరం రన్ వే పనులు పూర్తయిన క్రమంలో చుట్టు పక్కల సెల్ టవర్ ల వల్ల కొన్ని ఇబ్బందులను గుర్తించారు. రన్ వే సమీపంలో ఆరు సెల్ టవర్లున్నాయి, ఇప్పుడు ఈ టవర్ ల ఎత్తు తగ్గించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఏరోడ్రమ్ మీటింగ్ కమిటీ ఏఈఎంసీ సమావేశంలో రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ కుమార్ సెల్ టవర్ ల ఎత్తు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్ టవర్ ల రెడ్ లైట్లు వెలిగేలా చూడాలని జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సూచించారు. మరోవైపు విజయవాడ ఎయిర్ పోర్టులో ఇటీవలే రన్ వేను రెండు వేల రెండు వందల ఎనభై ఆరు మీటర్ ల నుంచి మూడు వేల మూడు వందల అరవై మీటర్ లకు విస్తరించారు.

అయితే భారీ విమానాలు ఎయిర్ బస్ 320, బోయింగ్ 747, బోయింగ్ 777 విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సమయంలో సెల్ టవర్ లు ఇబ్బందికరంగా ఉన్నాయని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు గుర్తించారు. గన్నవరం, బుద్ధవరం ప్రాంతాల మధ్య ఉన్న ఆరు సెల్ టవర్ లు విమానాలకు తగిలే అవకాశముందని అంచనా వేశారు. సెల్ టవర్ ల నిర్వాహకులకు మూడు నెలల గడువు ఇచ్చి జనవరిలో నోటీసులు పంపించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఈ సమస్య కేవలం సీఎంకే కాదు, త్వరలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం డైరెక్ట్ విమానాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సెల్ టవర్ లు ఎత్తు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రన్ వే పరిసరాలతో పాటు విమానాశ్రయం చుట్టూ జంతు వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు డంప్ చేయడం వల్ల విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో పక్షులు ఢీ కొనే అవకాశముంది. అందుకే ఎయిర్ పోర్ట్ చుట్టు పక్కల వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సీఎం భద్రత విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.