జనవరిలో జరగనున్న స్థానిక ఎన్నికలు... క్యాబినెట్ సమావేశంలో జగన్ ప్రకటన!!

 

సీఎం జగన్ స్థానిక ఎన్నికలకు సమర భేరిని మోగించారు. బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. విపక్షాలు ఎంత విమర్శించినా ఆంగ్ల మాధ్యమంపై అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదన్నారు. అక్రమ లేఅవుట్ లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దాం సిద్ధంగా ఉండండి అంటూ మంత్రులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం చేశారు. క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన స్పష్టత ఇచ్చారు. 

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశంలో అధికారిక అజెండా అంశాలు ముగిశాక రాజకీయ అంశాల పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులతో పలు అంశాలను ప్రస్తావించారు జగన్. అమ్మవడి కార్యక్రమాన్ని వాస్తవానికి జనవరి 26వ తేదీన నిర్వహిద్దామని అనుకున్నాం కానీ అదే నెల జనవరి 9వ తేదీన చేపడతామని అనుకోలేదన్నారు. తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ రూ.15 వేల నగదును అందింస్తామని ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టిన వెంటనే రాజకీయ వ్యవహారాలపై దృష్టి సారించి పాలనపై ప్రజాభిప్రాయం కోరనున్నట్లు తెలిపారు. జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం అని వెల్లడించారు.మంత్రులు.. ఎమ్మెల్యేలు.. స్థానిక సమరానికి సిద్ధంగా ఉండాలని నిర్దేశించారు.

ఈ నెలాఖరులోగా ఆలయ కమిటీ లు మార్కెట్ కమిటీలు వేయాలని మంత్రులను మరోసారి సీఎం ఆదేశించారు.గత కేబినెట్ భేటీలో ఇదే విషయాన్ని చెప్పిన సీఎం జగన్ బుధవారం నాటి మంత్రి వర్గ సమావేశంలోనూ దీని పై కర్తవ్య బోధ చేశారు. జిల్లా సమీక్షా సమావేశాలను త్వరగా పూర్తి చేయాలని ఇన్ చార్జి మంత్రులను ఆదేశించారు. ఆలయ కమిటీ లు మార్కెట్ కమిటీలను వేయాలని చెప్పారు. ఇందులో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కేటాయించాలని ఈ మొత్తం లోనూ యాభై శాతం మహిళలు ఉండేలా చూడాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.ఇన్ చార్జ్ మంత్రులు వారికి కేటాయించిన జిల్లాలో నాలుగు రోజులు ఉంటారో, అయిదురోజులూ ఉంటారో తనకు తెలియదని ఈ నెలాఖరులోగా జిల్లాలోని ఆలయ కమిటీ లను, మార్కెట్ కమిటీల భర్తీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 34 శాతం ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలులో ఉందని.. మిగిలిన 66 శాతం పాఠశాలల్లోనూ అమలు చెయ్యాలని తీర్మానించింది. ఈ వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు తెలిపారు. పోటీ ప్రపంచంలో ఏదో ఒక స్థాయిలో ఆంగ్ల భాషను అందరూ నేర్చుకుంటున్నారని కొందరు ఎనిమిదవ తరగతి, కొందరు ఇంటర్, డిగ్రీ, మరికొందరు పీజీ ఇలా ఏదో ఒక స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలోకి వెళుతున్నారన్నారు. అయితే సంగ్రహణ సామర్థ్యం బాల్యం నుంచే ఎక్కువగా ఉంటుంది గనుక ఒకటో తరగతి నుంచి పెడితే పేదపిల్లలు కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుంది అని మంత్రి వివరించారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు. పిల్లలు ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాతృభాష తెలుగు లేక ఉర్దూ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుందని మిగతా సబ్జెక్టుల మాత్రం ఆంగ్ల భాషలో బోధిస్తారని తెలిపారు.