ఏపీలో మహిళలకు అభయం.. కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

దిశ ఘటన తర్వాత మహిళల భద్రత పై ఆందోళనలు పెరుగుతున్నాయి. కఠిన చట్టాలు తీసుకురావాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. మహిళలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మహిళల పై నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టం తీసుకొస్తుంది. ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ఇప్పటికే మహిళా భద్రత పై చర్చకు పెట్టిన ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక బిల్లు కూడా తీసుకురానుంది. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్ట సవరణ బిల్లు 2019ని ఏపీ క్యాబినెట్ ఆమోదించింది. దీంతో పాటు ఏపీ స్పెషల్ కోర్ట్ ఫర్ సెట్ స్పెసిఫైడ్ అఫెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ యాక్ట్ 2019 కి కూడా రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా అమల్లో కి వస్తున్న ఈ చట్ట ప్రకారం అత్యాచారానికి పాల్పడితే నిందితులకు మరణ శిక్ష పడుతుంది. నేరాన్ని నిర్థారించే ఆధారాలుంటే 21 రోజుల్లోనే తుది తీర్పు వస్తుంది. వారంరోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి 14 రోజుల్లోనే కోర్టు విచారణ పూర్తి చేస్తారు. 21 రోజులల్లో శిక్షలు ఖరారు అవుతాయి. అంటే ప్రస్తుతమున్న 4 నెలల విచారణ కాలాన్ని 21 రోజులకు తగ్గించారు. అంతేకాదు మహిళలు చిన్నారులపై నేరాలు విచారించేందుకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తారు. 

ఇక సోషల్ మీడియాలో మహిళలను చిన్నారులను కించపరిచేలా అసభ్య పోస్టులు పెట్టిన వారిపై సెక్షన్ 354 ఈ కింద చర్యలు తీసుకుంటారు. మొదటి సారి తప్పు చేస్తే రెండేళ్ల, రెండోసారి పోస్టులు పెడితే నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తారు. పిల్లల పై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం కేవలం మూడు నుంచి ఐదేళ్ల వరకు శిక్ష పడుతుంది. దీనిని పది నుంచి పద్నాలుగేండ్ల వరకూ పొడిగిస్తూ చట్టంలో చేర్చారు. నేరాల్లో తీవ్రత ఉంటే జీవిత ఖైదు విధిస్తారు. ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని మహిళా సంఘాలు స్వాగతిస్తున్నాయి. మహిళలకు భద్రత పై ఇలాంటి కఠిన చట్టాలు భరోసా కల్పిస్తాయంటున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి కఠిన చట్టాలు తీసుకు రావాలని కోరుతున్నారు. నిర్భయ చట్టం కంటే మరింత కఠినంగా ఉండే చట్టాలను కేంద్రం కూడా తీసుకురావాలని మహిళలు కోరుతున్నారు.