మందుబాబులకు షాకిచ్చిన జగన్ సర్కార్

మందు బాబులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే వీల్లేదని పేర్కొంది. గతంలో మాదిరిగా మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకునేందుకు అనుమతిలేదని స్పష్టం చేసింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెస్తే 1968 ఏపీ ఎక్సైజ్ చట్టం ద్వారా శిక్షార్హులని, జీవో నెంబర్ 310ను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. 

 

కాగా, ఏపీలో మద్యం ధరలు పెరగడం, కావాల్సిన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో.. మద్యం ప్రియులు పొరుగు రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా మద్యాన్ని తెచ్చుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఏపీ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకు వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని కలిగించింది. దీంతో హైకోర్టు తీర్పుతో మద్యం ప్రియులకు ఉపశమనం కలిగినట్లు అయింది. అయితే తాజాగా ప్రభుత్వం తెచ్చిన జీవోతో మందుబాబులకు మళ్ళీ చిక్కులు తప్పవని అంటున్నారు.